15 July, 2026 | 8:49 PM

భూ రీ-సర్వేలో తప్పులకు తావులేకుండా కచ్చితత్వం పాటించాలి

15-07-2026 08:31 PM

కలెక్టర్ రాహుల్ శర్మ

గణపురం,(విజయక్రాంతి): సర్వే ప్రక్రియలో ఎలాంటి తప్పులకు తావులేకుండా పక్కాగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గణపురం శివారులో జరుగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో సర్వేయర్లు నిర్వహిస్తున్న విధానం, రికార్డుల నమోదును ఆయన నిశితంగా పరిశీలించారు.

సర్వే సిబ్బంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రోవర్ పరికరం ద్వారా భూములను సర్వే చేస్తున్న తీరు ఆయన గమనించారు. సాంకేతికతను వినియోగించి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా భూమి సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించి హద్దులు వేయాలని సూచించారు. భూ రీ-సర్వే ద్వారా సరిహద్దు వివాదాలు తగ్గి, రైతులకు తమ భూములపై హక్కులు స్పష్టంగా లభిస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఈ ప్రక్రియ దోహదపడుతుందని తెలిపారు.

సర్వే పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని, ప్రతి రైతు భూమి వివరాలు ఖచ్చితంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. మండలంలో జరుగుతున్న ఈ ప్రక్రియకు రైతులు సహకరించాలని, సరిహద్దు ఉన్న రైతులు తప్పనిసరిగా పాల్గొనాలని సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, తహశీల్దార్ రాజేశ్వరరావు, మండల సర్వేయర్ తిరుపతి, లైసెన్స్డ్ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.