బోధన్‌కు భూగర్భ జలాల గండం!
- ఎల్‌నినో ప్రభావంతో ఆందోళనకర పరిస్థితులు
- ఒక్క నెలలోనే 4.54 మీటర్లకు పడిపోయిన భూగర్భ జలమట్టం
- వేసవిలో తీవ్రం కానున్న తాగునీటి సమస్యలు
- ఇప్పటి నుంచే అప్రమత్తం కావాలని సూచనలు
- బోధన్ పట్టణంలో ఇప్పటికే రోజు తప్పి రోజు మున్సిపాలిటీ నీటి విడుదల చేస్తోంది.
బోధన్, నవంబర్ 27 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలో భూగర్భ జలమట్టం(Groundwater level) రోజురోజుకూ పడిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే బోధన్ పట్టణంలో రోజు తప్పించి రోజు నీటి విడుదల మున్సిపాలిటీ నీటి(Municipality water) సప్లై చేస్తుంది. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశాలు ఉండటంతో రానున్న వేసవిలో తాగునీటి సమస్యలు తీవ్రరూపం దాల్చే ప్రమాదం కనిపిస్తోంది. భూగర్భ జలాల శాఖ విడుదల చేసిన అక్టోబర్ నెల నివేదికలో వెల్లడైన గణాంకాలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి.
నివేదిక ప్రకారం సెప్టెంబర్ నెలలో భూమికి 3.97 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలమట్టం అక్టోబర్ నాటికి 3.51 మీటర్లకు పడిపోయింది. అంటే ఒక్క నెల వ్యవధిలోనే 5.54 మీటర్ల మేర నీటిమట్టం తగ్గడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్‌లో 6.01 మీటర్లుగా ఉన్న భూగర్భ జలమట్టం ఈ ఏడాది అక్టోబర్‌లో 9.51 మీటర్లకు చేరింది. ఏడాది వ్యవధిలో 5.50 మీటర్ల మేర తగ్గుదల నమోదైంది.
మరోవైపు వర్షపాతం తగ్గడం, భూగర్భ జలాల వినియోగం పెరగడం, పట్టణంలో కాంక్రీట్ నిర్మాణాలు అధికమవడం వంటి కారణాలు నీటి వనరులపై ప్రభావం చూపుతున్నాయి. బహుళ అంతస్తుల భవనాల నిర్మాణాలు, వాటి అవసరాల కోసం బోర్ల వినియోగం పెరగడం కూడా భూగర్భ జలాలపై ఒత్తిడిని పెంచుతోంది.
ఇప్పటికే భూగర్భ జలమట్టం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో రానున్న వేసవిలో బోధన్ పట్టణ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. పరిస్థితిని ముందుగానే గుర్తించి అధికారులు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. నీటి వృథాను అరికట్టడం, వర్షపు నీటిని ఒడిసిపట్టే చర్యలు చేపట్టడం, భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణ పాటించడం ద్వారా భవిష్యత్తులో ఎదురయ్యే నీటి సమస్యలను కొంతవరకు తగ్గించవచ్చు.
ప్రజలకు వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే సంబంధిత అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించి చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.