ప్రజాప్రతినిధులకే మార్కెట్ స్థలం కేటాయించడం సరికాదు

27-11-2026 | 04:13pm

నిరుద్యోగ యువతకు అవకాశం కల్పించాలి.. సీపీఎం డిమాండ్

ఇల్లెందు, (విజయక్రాంతి): పట్టణంలోని గోవింద్ సెంటర్‌లో(Govind Center) ఖాళీగా ఉన్న మార్కెట్ స్థలాన్ని ప్రజాప్రతినిధులకు మాత్రమే కేటాయించడం సరికాదని సీపీఎం ఇల్లందు మండల కార్యదర్శి ఆలేటి కిరణ్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక అనేక మంది నిరుద్యోగ యువతీ యువకులు ఇబ్బందులు పడుతుంటే, పాలకపక్షం తమ ప్రజాప్రతినిధులకే మార్కెట్ స్థలాన్ని అప్పగించడం అన్యాయమని విమర్శించారు.

ఈ మేరకు ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కిరణ్ మిత్ర డేనియల్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రజల పక్షాన ఉండాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు పాలకపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ప్రజాధికారాన్ని దుర్వినియోగం చేయడం తగదన్నారు. ఖాళీగా ఉన్న మార్కెట్ స్థలాన్ని నిరుద్యోగ యువతీ యువకులకు కేటాయిస్తే వారు స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఇప్పటికైనా అధికారులు, పాలకపక్షం స్పందించి న్యాయం చేయాలని, లేనిపక్షంలో సీపీఎం ఆధ్వర్యంలో ప్రజా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు మన్యం మోహన్‌రావు, ఎస్కే ఖాదర్, కోడెం బోస్, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు