మహిళా రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: దేశ రాజకీయాల్లో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. లోక్సభ స్థానాలను అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంచే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న స్థానాల నిష్పత్తిని మరో 25 ఏళ్లపాటు, అంటే 2051 వరకు కొనసాగించేలా ప్రతిపాదిత రాజ్యాంగ సవరణలకు పచ్చజెండా ఊపింది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. నవంబర్ 30 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ఉద్దేశించిన బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
లోక్సభ స్థానాల్లో 50 శాతం పెంపు
డీలిమిటేషన్ ప్రక్రియ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాల్లో వ్యక్తమవుతున్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అన్ని రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలను సమానంగా 50 శాతం పెంచడంతో పాటు, రాష్ట్రాల మధ్య ప్రస్తుత ప్రాతినిధ్య నిష్పత్తి మారకుండా 2051 వరకు కొనసాగించేలా ప్రతిపాదించారు.
ఈ మార్పులు అమల్లోకి వస్తే పార్లమెంటులో రాష్ట్రాల ప్రాతినిధ్యం పెరగనుంది. ముఖ్యంగా జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ప్రస్తుత నిష్పత్తి కొనసాగింపు ద్వారా ప్రాతినిధ్యం తగ్గుతుందనే ఆందోళనకు పరిష్కారం చూపే ప్రయత్నంగా ఈ నిర్ణయాన్ని భావిస్తున్నారు.
మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం
మహిళలకు లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టం అమలుకు సంబంధించి కూడా కేంద్ర కేబినెట్ సవరణలకు ఆమోదం తెలిపింది. గతంలో జనగణన, డీలిమిటేషన్ ప్రక్రియతో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల అమలును వేగవంతం చేయడమే తాజా ప్రతిపాదనల ఉద్దేశం.
పార్లమెంట్లో కీలక పరీక్ష
నవంబర్ 30 నుంచి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లకు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే కేబినెట్ ఆమోదం మాత్రమే సరిపోదు. రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంట్లో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఈ బిల్లులపై అధికార, ప్రతిపక్ష పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.