విజిలెన్స్ పై అవగాహన కార్యక్రమం
నస్పూర్, (విజయక్రాంతి) : సింగరేణి(Singareni) వ్యాప్తంగా విజిలెన్స్ అవగాహన వారోత్సవాలో(Vigilance Awareness Week Celebration) భాగంగా శుక్ర వారం శ్రీరాంపూర్ ఏరియాలోని సీసీసీ సింగరేణి గెస్ట్ హౌజ్ లో ‘ప్రాబిటీ - పాస్పారిటీ’ అంశంపై బెల్లంపల్లి రీజియన్ సింగరేణి అధికారులకు అవగాహన కల్పించారు. సాఫ్ట్ స్కిల్ ట్రైనర్(Soft Skills Trainer), ఎన్ఎల్పీ ప్రాక్టీషనర్ కిషోర్ అవినీతి నిర్మూలనపై శ్రీరాంపూర్ , బెల్లంపల్లి, మందమర్రి ఏరియా ల ఎగ్జిక్యూటివ్ లకు అవగాహన కల్పించేలా లెక్చర్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో(Public sector undertaking) పారదర్శక సేవలపై ఆయన అవగాహన కల్పించారు.
ప్రభుత్వరంగ సంస్థల్లో అవినీతి కార్యకలాపాలు, వాటి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై పీపీటి ఆధారంగా వివరణాత్మకంగా అవగాహన కల్పించారు. పారదర్శక సేవల ద్వారా సంస్థలు ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలుస్తాయి, మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతాయో వివరించారు. అవినీతి, లంచగొండితనం వ్యవస్థలను ఎలా భ్రష్టు పట్టిస్తున్నాయో అవగాహన కల్పించారు. అభివృద్ధికి ఆటంకంగా నిలిచే అవినీతి నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు.
విజిలెన్స్ అవగాహన వారితో భాగంగా బెల్లంపల్లి డివిజన్ రీజియన్ అధికారులకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. సింగరేణి వ్యాప్తంగా విజిలెన్స్ వారోత్సవాల ద్వారా ఉద్యోగులలో అవినీతి నిర్మూలనకు తగిన చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
సింగరేణి సంస్థ స్వయంగా విజిలెన్స్ విభాగం ఏర్పాటు చేసి ఎవరైనా స్వేచ్ఛగా ఫిర్యాదు చేసేలా ప్రోత్సహిస్తుందని, తద్వారా పారదర్శక సేవలు అందరికీ సమానంగా అందేలా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి రీజియన్ హెచ్ ఓ డీ లు, ఉన్నతాధికారులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.