సింగరేణి స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు
నస్పూర్, (విజయక్రాంతి ): మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలో సింగరేణి కంపెనీ లెవల్ షటిల్ బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నీస్(Singareni Company-level Shuttle Badminton and Table Tennis) పోటీలను శ్రీరాంపూర్ ఏరియా ప్రగతి స్టేడియంలోని సీఈఆర్ క్లబ్ లో శ్రీరాంపూర్ ఇంచార్జ్ జనరల్ మేనేజర్ ఏవీ రెడ్డి మంగళ వారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఉద్యోగులకు మానసిక, శారీరక ఆరోగ్యానికి దోహదపడుతాయన్నారు.
సింగరేణి సంస్థ ఖర్చుకు వెనకాడకుండా క్రీడలకు పెద్దఎత్తున వెచ్చిస్తూ క్రీడాకారులను ప్రోత్సహిస్తుందన్నారు. కంపెనీ లెవల్ షటిల్ బ్యాడ్మింటన్ అండ్ టేబుల్ టెన్నిస్ క్రీడలు శ్రీరాంపూర్ వేధికగా నిర్వహించటం గర్వకారణమన్నారు. ఇక్కడ విజేతలుగా నిలిచిన వారు కోల్ ఇండియా లోనూ సత్తా చాటి సింగరేణి పేరు నిలబెట్టాలని ఆకాంక్షించారు.
సీఈఆర్ క్లబ్ లో షటిల్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్, నస్పూర్ లోని మనోరంజన్ సముదాయ్ లో టేబుల్ టెన్నీస్ మెన్ అండ్ ఉమెన్, సీసీసీలోని ఎస్సీఈఓ క్లబ్ లో వెటరన్ బ్యాడ్మింటన్ మెన్ అండ్ ఉమెన్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో డీజీఎం (పర్సనల్) అనిల్ కుమార్, గుర్తింపు సంఘం ప్రతినిధి మురళి చౌదరి, సింగరేణి స్పోర్ట్స్ మేనేజర్ సునీల్, డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ శ్రీరాంపూర్ ఏరియా గౌరవ కార్యదర్శి పాల్ సృజన్, స్పోర్ట్స్ సూపర్ వైజర్ అశోక్, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్ సురేష్, క్రీడాకారులు, ఉద్యోగులు, తదితరులు పాల్గొన్నారు.