మల్లన్న పాదయాత్రలో పాల్గొనేందుకు బయలుదేరిన జిల్లా నాయకులు

25-09-2026 | 08:10pm

మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి) : బీసీ రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ(Telangana Rajyadhikara Party) వ్యవస్థాపక అధ్యక్షులు, తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) చేపట్టిన ‘బీసీ రాజ్యాధికార యాత్ర’లో పాల్గొనేందుకు జిల్లా నుంచి టీఆర్పీ నాయకులు శుక్ర వారం జిల్లా అధ్యక్షులు మహేష్ వర్మ ఆధ్వర్యంలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మహేష్ వర్మ మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ పెట్టి బీసీల, బహుజనుల ఆత్మగౌరవ జెండాను అందించి ప్రజల భరోసా కల్పించిన తీన్మార్ మల్లన్న, ఇప్పుడు ఈ ‘బీసీ రాజ్యాధికార యాత్ర’తో మరో చారిత్రక గట్టానికి పురుడుపోశారని అన్నారు.

అగ్రవర్ణ నాయకుల రాజకీయ ఆధిపత్యాన్ని అంతం చేసి, బహుజనులకు రాజ్యాధికారాన్ని సాధించి, ఎవరెంతో వారికంతా వాటా అందించేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకత్వం పనిచేస్తుందని స్పష్టం చేశారు. వచ్చేది బీసీల రాజ్యమే అని, రానున్న రోజుల్లో అగ్రవర్ణ రాజకీయ నాయకుల రాజకీయ సమాదులను ఈ బహుజన మేధావులు, ప్రజలు నిర్మిస్తారని స్పష్టం చేశారు.

మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బహుజనులు ఐక్యంగా ముందుకు రావాలని, ‘బీసీ రాజ్యాధికార యాత్ర’లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అగ్రవర్ణ రాజకీయ పార్టీలకు కొమ్ముకాస్తున్న బీసీ ద్రోహులను ప్రజలు గమనిస్తున్నారని, అగ్రవర్ణ పార్టీలకు, నాయకులకు ప్రజలే ఓటుతో బుద్ది చెబుతారని తెలిపారు. ఆత్మగౌరవంతో అధికారాన్ని సాధించి, ఎవరెంతో వారికంతా వాటా అందించి నిజమైన ప్రజా రాజకీయాన్ని ప్రజలకు అందించి, సామాజిక తెలంగాణను నిర్మిస్తామని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు