భక్తిభావం, ఐక్యతకు ప్రతీక గణనాథుడి శోభాయాత్ర

25-09-2026 | 08:47pm
  1. శాంతియుత వాతావరణంలో నిమజ్జనోత్సావాలను జరుపుకుందాం
  2. కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

కొత్తగూడెం, (విజయక్రాంతి) : భక్తిభావం, సమాజంలో ఐక్యతను పెంపొందించడానికి వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా జరిగే గణనాథుడి శోభాయాత్ర గొప్ప ప్రతీక అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Kunamneni Sambasiva Rao) పేర్కొన్నారు. గణనాథుడి నిమజ్జన శోభాయాత్రను పురస్కరించుకుని పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత స్వామివారికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తుల జయజయధ్వానాల నడుమ గణనాథుల శోభాయాత్రను ఎమ్మెల్యే కూనంనేని లాంఛనంగా ప్రారంభించారు.

ఆ తర్వాత త్రీటౌన్ సెంటర్లో ఏర్పాటు చేసిన స్వాగత వేదిక వద్దకు చేరుకుని, వివిధ ప్రాంతాల నుంచి భద్రాచలం గోదావరి తీరానికి తరలివెళ్తున్న విగ్రహాలకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా ప్రజలంతా ఒక్కచోట చేరి ఐక్యంగా జరుపుకునే ఇలాంటి ఉత్సవాలు సామరస్యానికి నిదర్శనమన్నారు. మన సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుకుంటూ రాబోయే తరాలకు అందించాల్సిన గురుతర బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచిన విఘ్నేశ్వరుడి కృపాకటాక్షాలతో నియోజకవర్గ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు, ప్రజలు సంయమనం పాటిస్తూ శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్, డిప్యూటీ మేయర్ లలిత కుమారి, కాంగ్రెస్ నాయకులు కంచర్ల చంద్రశేఖర్, నాగ సీతారాములు, లక్ష్మీప్రసన్న, కోనేరు చిన్ని, లక్ష్మణరావు, యెర్ర కామేష్,  దేవాదాయ శాఖ కార్యదర్శి రజని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు