యుగే యుగీన్ భారత్ మ్యూజియం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: భారతదేశ చరిత్ర, సంస్కృతి, నాగరికతా వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పే మరో భారీ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్ భవనాలను అత్యాధునిక మ్యూజియంగా మార్చేందుకు రూ.3,230 కోట్ల ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ మ్యూజియానికి ‘యుగే యుగీన్ భారత్ మ్యూజియం’గా నామకరణం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు దశలవారీగా పనులు చేపట్టనున్నారు.
చరిత్రను కళ్లకు కట్టేలా ప్రత్యేక గ్యాలరీలు
సుమారు 1.78 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూపుదిద్దుకోనున్న ఈ మ్యూజియంలో భారతీయ నాగరికతకు సంబంధించిన అనేక విశేషాలను ప్రదర్శించనున్నారు. పురాతన వాస్తుశిల్పం, నగర నిర్మాణాలు, గణితం, ఖగోళశాస్త్రం, భాషలు, లిపులు, ఆధ్యాత్మికత, వాణిజ్యం వంటి విభిన్న అంశాలకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేయనున్నారు.
18 లక్షల చారిత్రక వస్తువుల పరిశీలన
దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ మ్యూజియంలు, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిధిలోని మ్యూజియంలు, రాష్ట్ర మ్యూజియంలు, ప్రైవేటు సేకరణల నుంచి సుమారు 18 లక్షల వస్తువులను ప్రదర్శన కోసం గుర్తించారు. ప్రస్తుతం వాటి ఎంపిక, పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది.
2027లో తొలి గ్యాలరీ ప్రారంభం
మ్యూజియంలోని ‘అలంకరణ’ (Adornment) పేరుతో రూపొందిస్తున్న తొలి గ్యాలరీని 2027 ద్వితీయార్థంలో నార్త్ బ్లాక్లో సందర్శకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాత భవనాల చారిత్రక వాస్తు శైలిని కాపాడుతూనే ఆధునిక సాంకేతికతతో ఈ మ్యూజియాన్ని అభివృద్ధి చేయనున్నారు.
దేశ చరిత్రను ఒకే ప్రాంగణంలో అనుభూతి చెందేలా రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టు అంతర్జాతీయ పర్యాటకులను సైతం ఆకర్షించే అవకాశం ఉంది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం ఈ మ్యూజియం ఏడాదికి కోటి మంది సందర్శకులకు ఆతిథ్యం ఇచ్చేలా రూపొందిస్తున్నారు. ప్రపంచంలోని ప్రముఖ మ్యూజియంలతో పోలిస్తే అత్యధిక ప్రదర్శన విస్తీర్ణం కలిగిన మ్యూజియంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.