బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో విషాదం...!
- పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణీకి నామమాత్రపు వైద్య పరీక్షలా...?
- గర్భంలోనే మృతి చెందిన శిశువు...వైద్యురాలు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమం...
- ఆసుపత్రి సూపరింటెండెంట్ కు బాధితుల ఆరోపణలు, ఫిర్యాదు...
- సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్...
బాన్సువాడ, అక్టోబర్ 13 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రిలో(Banswada Government Hospital) మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పురిటి నొప్పులతో ఆసుపత్రికి వచ్చిన గర్భిణీకి నామమాత్రపు వైద్య పరీక్షలు నిర్వహించారంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనలో గర్భంలోనే శిశువు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైద్యురాలు, ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే ఈ విషాదానికి కారణమని బాధితులు ఆసుపత్రి సూపరిండేంట్ శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు.బాన్సువాడ మండలానికి చెందిన నాగరాణి, భర్త హరీష్ పురోహిత్ కుటుంబీకుల కథనం ప్రకారం, అక్టోబర్ 9వ తేదీన నాగరాణికి పురిటి నొప్పులు రావడం, బిడ్డ కదలికలు లేకపోవడంతో బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు.
అక్కడ విధుల్లో ఉన్న వైద్యులు పరీక్షించి బిడ్డకు హృదయ స్పందన ఉందని చెప్పి ఒక గ్లూకోస్ ను గర్భిణీకి ఎక్కించారు.ఆ తర్వాత గ్రంథస్తి (మాయ) సమస్యతో బిడ్డ కదలికలు లేకపోయినా వైద్యులు పట్టించుకోలేదని, స్పందించలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి విషమించడంతో వారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లగా,
అక్కడ స్కానింగ్ చేసిన వైద్యులు అప్పటికే బిడ్డ మృతి చెందిందని నిర్ధారించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని బాధితులు కోరుతున్నారు.
వైద్య సేవలపై మరోసారి ప్రశ్నలు...!
ప్రసవం కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన చికిత్స అందించాల్సిన బాధ్యత వైద్యులపై ఉంటుంది. అయితే, ఈ ఘటనలో గర్భిణీకి అందించిన వైద్య సేవలపై బాధితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
పురిటి నొప్పులతో వచ్చిన సమయంలో తగిన పరీక్షలు నిర్వహించారా? గర్భస్థ శిశువు పరిస్థితిని సకాలంలో గుర్తించారా? అవసరమైన వైద్య చర్యలు తీసుకున్నారా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సమగ్ర విచారణకు డిమాండ్...
ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన బాన్సువాడ ఏరియా ఆసుపత్రి వైద్యురాలు శ్రీలత పై కఠిన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, అదే రోజు అక్టోబర్ 9న విధుల్లో ఉన్న నర్సులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబం మంగళవారం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కు లిఖితపూర్వక ఫిర్యాదు చేసింది.
వాస్తవాలు తేలాలంటే అక్టోబర్ 9వ తేదీ మధ్యాహ్నం నాటి సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ ఫిర్యాదును ఆసుపత్రి ఇన్ వార్డ్ లో స్వీకరించారు. బాధితురాలి తండ్రి తరపున హరీష్ సంతకం చేశారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో సుంకరి హరీష్ పటేల్ తో పాటు పలువురు స్థానికులు పాల్గొన్నారు.ఇటీవల కాలంలో బాన్సువాడ ఏరియా ఆసుపత్రిపై వరుస ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.