అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరు మెరుగుపరచాలి
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు
భూపాలపల్లి టౌన్, నవంబర్ 06 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమ లక్ష్యాల సాధనలో జిల్లాల పనితీరును మరింత మెరుగుపరచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు(Telangana CS Sanjay Jaju) జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
సమగ్ర శిక్షా, పీఎం శ్రీ పథకాలు, వీబీజి రాంజీ, చేయూత పింఛన్ల దరఖాస్తులు విచారణ, తాగునీటి సరఫరా, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తదితర అంశాలపై శుక్రవారం డా బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి ఆయా శాఖల కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా ఐడీఓసీ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, సబ్ కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సమగ్ర శిక్ష అభియాన్, పీఎం శ్రీ పథకాలకు కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో వినియోగించాలని సీఎస్ సూచించారు.
జనవరి మొదటి వారంలోగా నిధుల వ్యయాన్ని గరిష్ట స్థాయికి తీసుకెళ్లాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు పొందేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. పీఎం శ్రీ పథకం కింద రూ.538 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు 10 శాతం నిధులు కూడా ఖర్చు కాలేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 794 పీఎం శ్రీ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, విద్యా ఫలితాల మెరుగుదలకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రతి పది రోజులకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి సమగ్ర శిక్ష అభియాన్ కింద రూ.1,763 కోట్లు కేటాయించగా, ఇప్పటివరకు రూ.79 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు వివరించారు. సమగ్ర శిక్ష, విబిజిరాంజీ పథకాలను సమన్వయం చేసుకుంటూ పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేపట్టాలని సూచించారు. పాఠశాలలను అధికారులు తరచూ సందర్శించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడంతో పాటు మధ్యాహ్న భోజనం, అల్పాహార పథకాలను నాణ్యతతో అమలు చేయాలని ఆదేశించారు.
వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే విద్యార్థులకు యూనిఫారాలు, పాఠశాల కిట్లు అందించేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. వేసవి కాలం ముగిసే వరకు ప్రజలకు నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎస్ స్పష్టం చేశారు. తాగునీటి సమస్యలు తలెత్తే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ నీటి వనరులను గుర్తించి వినియోగించుకోవాలని, అవసరమైన చోట ప్రైవేట్ బోర్వెల్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా, కొత్త బోర్వెల్ల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రతి జిల్లాలో జిల్లా స్థాయి తాగునీటి కమిటీలను ఏర్పాటు చేసి, జిల్లా పంచాయతీ అధికారి, మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, పబ్లిక్ హెల్త్ అధికారులతో పాటు సంబంధిత శాఖల అధికారులను సభ్యులుగా నియమించాలని ఆదేశించారు. జిల్లా కమిటీ ప్రతి వారం సమావేశమై తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించాలని, నవంబర్ నెలాఖరులోగా మండల స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. నవంబర్ 15వ తేదీలోగా చేతిపంపులు, బోర్లు, బహిరంగ బావులు తదితర తాగునీటి వనరులకు అవసరమైన మరమ్మతులు పూర్తి చేయాలని సూచించారు.
నవంబర్ 15 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఆదేశించారు. మిషన్ భగీరథ పైప్లైన్లలో ప్రెజర్ వాల్వ్‌లను నిరంతరం పర్యవేక్షిస్తూ నీటి వృథాను అరికట్టాలని, అక్రమ కనెక్షన్లు, ట్యాపింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. విబిజి రాంజీ ద్వారా మార్చి నెలాఖరు నాటికి 12 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని సాధించాలని, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, కేంద్ర పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.