కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న కమిషనర్
మల్యాల,అక్టోబర్13,(విజయ క్రాంతి ): శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం, కొండగట్టును దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ శ్రీ మంత్రి హనుమంతరావు(Sri Mantri Hanumantha Rao, Commissioner of the Endowments Department) కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించి, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి కమిషనర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వేదమంత్రోచ్ఛారణలతో కమిషనర్ ఆశీర్వచనం అందజేశారు.
కమిషనర్ మాట్లాడుతూ, కొండగట్టు దేవస్థాన అభివృద్ధికి అవసరమైన పలు అభివృద్ధి పనులను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శ్రీ తిరుమల తిరుపతి దేవస్థానం వారి రూ. 35.19 కోట్ల నిధులతో 96 గదుల ధర్మసత్రం మరియు దీక్ష విరమణ మండపం నిర్మాణానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తయిందని, పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని వివరించారు.
నవంబర్ 15వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ స్వామివారి చందనోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాలకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన సౌకర్యాలు కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి అంజనా రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి హరిహరనాథ్, పర్యవేక్షకులు శ్రీ సునీల్ కుమార్, ప్రధాన అర్చకులు డాక్టర్ జితేంద్ర ప్రసాద్, శ్రీ చిరంజీవి స్వామి, మారుతి ప్రసాద్, స్థానాచార్యులు కపిందర్, ఆలయ పరిశీలకులు అశోక్ మరియు దేవస్థాన అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.