ఉత్సవ రథం పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
హనుమకొండ, అక్టోబర్ 13(విజయ క్రాంతి):భద్రకాళి దేవాలయంలో(Bhadrakali Temple) రథోత్సవం నిర్వహణకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి(District Collector Chahat Bajpai) మంగళవారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో రూపుదిద్దుకుంటున్న ఉత్సవ రథం పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.
రథోత్సవ ఏర్పాట్ల వివరాలను ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు, ఆలయ కార్య నిర్వహణాధికారి సునీత ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆలయ మాడవీధుల్లో ఉత్సవ రథం సజావుగా తిరిగేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. భద్రకాళి చెరువులో తగినంత నీటి వసతి లేనందున తెప్పోత్సవానికి తాత్కాలికంగా నీటి కొలను ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఎస్ఈ రాంప్రసాద్, అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా భద్రకాళి తాగునీటి జలాశయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సాగునీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. భద్రకాళి తాగునీటి జలాశయానికి దేవాదుల నీరు చేరేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్ఈ రాజ్ కుమార్, హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇరిగేషన్ డీఈ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.