ఆటో నుజ్జునుజ్జు.. నలుగురికి తీవ్ర గాయాలు
బోధన్, నవంబర్ 10 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బోధన్ నుంచి రుద్రూర్ వెళ్లే ప్రధాన రహదారిపై భారడి పోషమ్మ ఆలయం సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ఆటోపై భారీ మర్రిచెట్టు ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో ఆటో పూర్తిగా ధ్వంసమవగా, అందులో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రుద్రూర్ పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీసి సమీప ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు రహదారిపై అడ్డంగా పడిన భారీ మర్రిచెట్టును తొలగించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. చెట్టు కూలిపోవడంతో రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు.
రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు అకస్మాత్తుగా కూలిపోవడంతో వాహనదారులు, స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదకరంగా ఉన్న భారీ వృక్షాలను అధికారులు ముందుగానే గుర్తించి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.