మంచంతో సహా కాలిపోయిన వ్యక్తి.. మిస్టరీగా మృతి

10-11-2026 | 10:09am

కంగ్టి, నవంబర్ 10 (విజయక్రాంతి): మండలంలోని దేగులవాడి గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గునే జరప్ప (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మంచంతో సహా ఆయన శరీరం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించడంతో గ్రామంలో కలకలం రేగింది.

గ్రామస్తుల వివరాల ప్రకారం.. జరప్ప తన ఇంట్లో మంచంపై ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడికి భార్య బుజ్జమ్మతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఘటనపై సమాచారం అందుకున్న కంగ్టి ఎస్సై దుర్గారెడ్డి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం (Postmortem) నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

జరప్ప మృతి ప్రమాదవశాత్తు జరిగిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

మరిన్ని వార్తలు