బాండ్‌బజార్‌లో కీలక మార్పు.. కొత్త సీఈఓగా

11-11-2026 | 05:51pm

ముంబై: ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పెట్టుబడుల రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ డిజిటల్‌ వేదిక బాండ్‌బజార్‌ కీలక నియామకాన్ని ప్రకటించింది. సంస్థ నూతన చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సీఈఓ)గా ఎస్‌. శంభత్‌ కుమార్‌ను నియమించింది. సంస్థ వ్యాపార విస్తరణ, డిజిటల్‌ సేవల అభివృద్ధి లక్ష్యంగా ఆయనకు బాధ్యతలు అప్పగించింది.

కొత్త బాధ్యతల్లో భాగంగా బాండ్‌బజార్‌ సాంకేతిక వ్యవస్థను మరింత ఆధునీకరించడం, పంపిణీ నెట్‌వర్క్‌ను విస్తరించడం, దేశవ్యాప్తంగా చిన్న, మధ్యతరహా మదుపరులకు ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ పెట్టుబడులను చేరువ చేయడంపై శంభత్‌ కుమార్‌ దృష్టి సారించనున్నారు.

ఆర్థిక రంగంలో 25 ఏళ్ల అనుభవం

శంభత్‌ కుమార్‌కు ఆర్థిక సేవలు, వ్యాపార నిర్వహణ, ఉత్పత్తుల అభివృద్ధి, పెట్టుబడి ఉత్పత్తుల పంపిణీ విభాగాల్లో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌లో చీఫ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. రిలయన్స్‌ క్యాపిటల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌లో బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ విభాగానికి నేతృత్వం వహించారు. స్పార్క్‌ క్యాపిటల్‌తోనూ ఆయనకు పనిచేసిన అనుభవం ఉంది.

డిజిటల్‌ పెట్టుబడుల విస్తరణే లక్ష్యం

కొత్త నియామకంపై శంభత్‌ కుమార్‌ స్పందిస్తూ.. భారత ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ మార్కెట్‌లో రిటైల్‌ పెట్టుబడిదారుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. సాంకేతికత సాయంతో పెట్టుబడులను మరింత సులభతరం చేయవచ్చని అభిప్రాయపడ్డారు. పెట్టుబడిదారులకు పారదర్శకమైన, నమ్మకమైన సేవలు అందించడంతో పాటు సంస్థ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా విస్తరించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.

మరిన్ని వార్తలు