ఎల్‌నినో ప్రభావంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

26-10-2026 | 05:48pm

తక్కువ నీటితో పండే పంటలను ఎంచుకోవాలి: ఎమ్మెల్యే జారె

దమ్మపేట, అక్టోబర్ 26, (విజయక్రాంతి): ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో వర్షాభావం లోపించి ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ(MLA Jare Adinarayana) సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండించే పంటలను ఎంచుకోవాలని, నీటి లభ్యతను అంచనా వేసిన తర్వాతే సాగు ప్రారంభించాలని రైతులకు సూచించారు.

దమ్మపేట మండలంలోని రైతు వేదికలో ఆత్మ కమిటీ ఆధ్వర్యంలో చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు అధ్యక్షతన రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎం ఎల్ ఏ జారే ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రస్తుతం నీరు అందుబాటులో ఉందని ఎక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేస్తే పంట చేతికొచ్చే సమయంలో నీటి కొరత ఏర్పడి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపారు.

రాబోయే ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటించాలని పేర్కొన్నారు. తమకు అందుబాటులో ఉన్న నీటి వనరులు, భూమి స్వభావం, వాతావరణ పరిస్థితులను బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగిస్తూ వ్యవసాయంలో నష్టాలను తగ్గించుకునే దిశగా రైతులు ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు.

ప్రతీ గ్రామంలో రైతులకు అవగాహన కల్పించాలి

ఎల్‌నినో ప్రభావం వర్షాల కొరత అధిక ఉష్ణోగ్రతల వల్ల వ్యవసాయంపై పడే ప్రభావాన్ని రైతులకు వివరించాలని  అధికారులకు సూచించారు. గ్రామసభల ద్వారా ప్రతి గ్రామంలో రైతులతో పాటు ప్రజలకు కూడా ఈ విషయాలపై అవగాహన కల్పించాలని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటూ స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపికపై తగిన సలహాలు ఇవ్వాలని సూచించారు.

రైతులు ముందుగానే అప్రమత్తమై నీటి లభ్యతకు అనుగుణంగా సాగు ప్రణాళికలు రూపొందించుకుంటే పంట నష్టాలను కొంతవరకు నివారించవచ్చని ఈ సందర్భంగా వివరించారు. రైతులు అధికారుల సూచనలు పాటిస్తూ నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు, స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు, ఏడీఈ రవికుమార్, అగ్రికల్చర్ ఏఈఓలు అనుబాబు, చంద్రశేఖర్ రెడ్డి, కావ్య వినోద్, కేశవరావు, కాంగ్రెస్ నాయకులు వాసం శ్రీనివాసరావు, బండి చెన్నా రెడ్డి, మోహన్ రావు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు