నాగన్‌పల్లిలో టీబీ స్క్రీనింగ్ క్యాంపు విజయవంతం

26-10-2026 | 06:42pm

టీబీ బాధితులకు మందులు, గుడ్లు, పోషకాహార సరుకుల పంపిణీ

బోధన్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం(TB Mukt Bharat Abhiyan Program)లో భాగంగా బోధన్ మండలంలోని నాగన్‌పల్లి గ్రామంలో సోమవారం టీబీ స్క్రీనింగ్ క్యాంపును విజయవంతంగా నిర్వహించారు. పీహెచ్‌సీ సాలూరా పరిధిలో నిర్వహించిన ఈ వైద్య శిబిరంలో గ్రామ ప్రజలకు వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు అందజేశారు.

ఈ శిబిరంలో లక్షణాల ఆధారంగా యాక్టివ్ టీబీ స్క్రీనింగ్‌తో పాటు ఛాతీ ఎక్స్‌రే (సీఎక్స్‌ఆర్), ఎన్‌ఏఏటీ పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా బీపీ, షుగర్, ర్యాండమ్ బ్లడ్ షుగర్ (ఆర్‌బీఎస్), హెచ్‌ఐవీ, సిఫిలిస్ పరీక్షలు చేపట్టారు. పరీక్షల ద్వారా టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించి, అవసరమైన వారికి వైద్య సేవలు అందించారు.

టీబీ వ్యాధి నిర్ధారణ అయిన బాధితులకు అవసరమైన మందులతో పాటు గుడ్లు, పోషకాహారానికి ఉపయోగపడే కిరాణా సరుకులను పంపిణీ చేశారు. టీబీ బాధితులు వైద్యుల సూచనల మేరకు క్రమం తప్పకుండా మందులు వాడుతూ, పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.

ఈ కార్యక్రమానికి బోధన్ డివిజన్ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ విద్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు టీబీ వ్యాధిపై అవగాహన కల్పించడం, వ్యాధిగ్రస్తులను ముందుగానే గుర్తించి చికిత్స అందించడం ఈ శిబిరం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

శిబిరం నిర్వహణలో పీహెచ్‌సీ సాలూరా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విద్యాసాగర్, నాగన్‌పల్లి గ్రామ సర్పంచ్ వినోద్, గ్రామ కార్యదర్శి అజహర్, ఎండీ ఆవున్ అహ్మద్ (ఎస్‌టీఎస్), సాయి కుమారి (టీబీ నోడల్ పర్సన్), ఏఎన్‌ఎంలు, ఐసీటీసీ మొబైల్ టీమ్ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించడంలో సిబ్బంది సమన్వయంతో పనిచేశారు.

మరిన్ని వార్తలు