విశాఖ–ఢిల్లీ మధ్య నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులు

26-10-2026 | 06:33pm

భారతదేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్‌(Akasa Air)... విశాఖపట్నం, ఢిల్లీ నగరాల మధ్య రోజువారీ  విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇవి నేరుగా ఆయా ప్రాంతాలను కలుపుతాయి. ఈ సర్వీసులో భాగంగా తొలి విమానం 2026 అక్టోబర్‌ 25న విశాఖపట్నంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఉదయం 9.05 గంటలకు బయలుదేరి, ఉదయం 11.30 గంటలకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది.

ఈ నూతన సర్వీసుతో విశాఖపట్నం నుంచి దేశ రాజధాని ఢిల్లీకి ప్రయాణించే వారికి సౌకర్యవంతమైన  విమాన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అదే సమయంలో దేశీయ విమానయాన మార్కెట్‌లోని కీలక నగరాలకు తమ సేవలను మరింత విస్తరించేందుకు ఆకాశ ఎయిర్‌కు ఈ సర్వీసు దోహదపడనుంది. ఆకాసా ఎయిర్‌ అక్టోబర్‌ 25, 2026 నుంచి విశాఖపట్నం–ఢిల్లీ మధ్య రోజువారీ నాన్‌స్టాప్‌ విమాన సర్వీసులను నడుపుతోంది. విమానాల వేళలు ఈ విధంగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి ఉదయం 5.55 గంటలకు బయలుదేరే QP 1841 విమానం ఉదయం 8.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. అలాగే విశాఖపట్నం నుంచి ఉదయం 9.05 గంటలకు బయలుదేరే QP 1842 విమానం ఉదయం 11.30 గంటలకు ఢిల్లీ చేరుకుంటుంది.

ఈ రెండు సర్వీసులూ ప్రతిరోజూ అందుబాటులో ఉంటాయి. ఆకాశ ఎయిర్‌ తమ  ఉద్యోగులకు అనుకూలమైన పని సంస్కృతి, కస్టమర్‌ సేవలకు ప్రాధాన్యమిచ్చే విధానం, సాంకేతికత ఆధారిత సేవలతో లక్షలాది మంది ప్రయాణికుల ఆదరణ పొందుతోంది.ఆ సంస్థకు చెందిన సరికొత్త విమానాల్లో ప్రయాణికులకు కాళ్లు చాపుకునేందుకు తగినంత స్థలం ఉండటంతో పాటు, అధిక శాతం విమానాల్లో యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్టులు అందుబాటులో ఉన్నాయి. విమానంలో అందించే ఆహార సేవ ‘కేఫే ఆకాశ’ ద్వారా ఆరోగ్యకరమైన, రుచికరమైన వివిధ రకాల ఆహార పదార్థాలను ప్రయాణికులకు అందిస్తోంది.

మరిన్ని వార్తలు