ఐదు నెలల వేటకు తెర.. నిందితుల అరెస్ట్!

26-10-2026 | 04:57pm

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో సంచలనం సృష్టించిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య తనూజ హత్య(Retired IPS Wife Tanuja Murder) కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఘటన జరిగిన ఐదు నెలల తర్వాత కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులను అరెస్టు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్(Hyderabad Police Commissioner Sajjanar) వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రాష్ట్రాల సరిహద్దులు దాటి గాలింపు చేపట్టాయని తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని ప్రశాసన్ నగర్‌లో తనూజ హత్యకు గురైన ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

విశ్రాంత ఐపీఎస్ అధికారి ఇంట్లో పనిచేసే కల్పనపై అనుమానం రావడంతో ఆమె కదలికలపై నిఘా పెట్టినట్లు సీపీ వెల్లడించారు. ఘటన జరిగిన 15 రోజుల్లోనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. కేసు ఛేదన కోసం సుమారు 25 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సజ్జనార్ తెలిపారు. ఢిల్లీ, సూరత్, పుణెతో పాటు ఇండో-నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ పోలీసులతో పాటు రైల్వే పోలీసుల సహకారం కూడా తీసుకున్నట్లు వెల్లడించారు.

నిందితులు దేశ సరిహద్దులు దాటి నేపాల్‌(Nepal)కు పారిపోయినట్లు గుర్తించడంతో అక్కడ కూడా గాలింపు చర్యలు కొనసాగించారు. సుదీర్ఘ ప్రయత్నాల అనంతరం నిందితులను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు పోలీసులు తెలిపారు. తనూజను హత్య(Tanuja Murder) చేసిన అనంతరం ఇంట్లోని విలువైన వస్తువులతో పాటు సుమారు 225 గ్రాముల బంగారాన్ని దోచుకెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సీపీ పేర్కొన్నారు. ఇంట్లో పనిచేసే కల్పన ముఠాకు సమాచారం అందించిందని ఆరోపించారు. ఈ కేసులో హత్యతో పాటు చోరీ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

ధర్మ తెరువా అలియాస్ కల్పన, గణేష్ బిశ్వకర్మ, చంద్ర బాదుర్ తమంగ్, గణేష్ బహదూర్ సాయ్‌లను అరెస్టు చేసినట్లు సీపీ వెల్లడించారు. వీరంతా కలిసి ముఠాగా ఏర్పడి హత్య, చోరీకి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఇద్దరి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఐదు నెలల పాటు కొనసాగిన దర్యాప్తులో వివిధ ప్రాంతాల్లో ఆధారాలు సేకరించి నిందితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల అరెస్టుతో కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు