ఎల్నినో ప్రభావంతో మిరప పంటకు తీవ్ర నష్టం
రైతులు అప్రమత్తంగా ఉండాలి
కన్నాయిగూడెం మండల వ్యవసాయశాఖ అధికారి ముంజ మహేష్
కన్నాయిగూడెం (విజయక్రాంతి): ఎల్నినో(El Nino) ప్రభావంతో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అధిక వేడి కారణంగా మిరప పంటలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. నెల రోజులైనా కోలుకోని మిరప చేల్లో మొక్కలు ఎండిపోతూ, చనిపోతున్న పరిస్థితిని గమనించిన వ్యవసాయ శాఖ అధికారి ముంజ మహేష్ గంగారం, లక్ష్మీపురం గ్రామాల్లోని మిరప పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధిక ఉష్ణోగ్రతల కారణంగా మిరప మొక్కలు తీవ్ర వేడి ఒత్తిడికి గురవుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మల్చింగ్ పేపర్ కింద నేలలో వేడి అధికంగా పేరుకుపోవడం, వంటి పరిస్థితులు మొక్కల పెరుగుదలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో మిరప మొక్కలు కోలుకోలేక ఎండిపోతున్నాయని వివరించారు.
రైతులు పంట పొలాల్లో నేలలోని తేమను తరచుగా పరిశీలిస్తూ, పంట అవసరాన్ని బట్టి తగినంత నీటిని అందించాలని సూచించారు. మల్చింగ్ పేపర్ కింద నేల వేడి, మొక్కల వేర్ల పరిస్థితిని పరిశీలించాలని, మొక్కలు అకస్మాత్తుగా వాడిపోవడం లేదా ఎండిపోవడం కనిపిస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని తెలిపారు.
మొక్కలు ఎండిపోవడానికి అధిక ఉష్ణోగ్రతలతో పాటు వేరు కుళ్లు వంటి ఇతర కారణాలు కూడా ఉండవచ్చని, కాబట్టి సరైన కారణాన్ని గుర్తించిన తర్వాతే తగిన నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు అప్రమత్తంగా ఉండాలని, మిరప పంటను కాపాడుకునేందుకు వ్యవసాయ శాఖ సూచనలు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారి ముంజ మహేష్ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కళ్యాణి, రైతులు పాల్గొన్నారు