రోజూ ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలుసా?
హెల్త్: శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల్లో ప్రోటీన్ చాలా కీలకం. చాలామంది బరువు తగ్గే సమయంలో లేదా Gymలో కండరాలు పెంచుకునేటప్పుడు మాత్రమే దీనిపై దృష్టి పెడుతున్నారు. కానీ శరీరంలోని కణాల నిర్మాణం, కండరాల పటుత్వం, రోగనిరోధక శక్తి, కణజాల మరమ్మతులకు ప్రోటీన్ నిరంతరం అవసరం. అందుకే రోజువారీ Dietలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
ప్రోటీన్ ఎందుకు అవసరం?
ప్రోటీన్ కేవలం కండరాల నిర్మాణానికే పరిమితం కాదు. శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి బాగుచేయడం, హార్మోన్లు, ఎంజైమ్‌ల తయారీ, Immunity మెరుగుపడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. పిల్లల ఎదుగుదల నుంచి వృద్ధుల కండరాల సంరక్షణ వరకు ప్రతి దశలోనూ ఇది అవసరం.
రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి?
సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్దలు తమ శరీర బరువులో ప్రతి కిలోకు కనీసం 0.8 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి.
- 60 కిలోల బరువు: రోజుకు సుమారు 48 గ్రాములు.
- వృద్ధులు: కిలో బరువుకు 1 నుంచి 1.2 గ్రాములు అవసరమవచ్చు.
- గర్భిణులు, బాలింతలు: రోజువారీ అవసరం పెరుగుతుంది. సాధారణంగా గర్భిణులకు రోజుకు సుమారు 71 గ్రాముల అవసరం ఉండవచ్చు.
- జిమ్ చేసేవారు: వ్యాయామ తీవ్రత, శారీరక శ్రమను బట్టి ఎక్కువ ప్రోటీన్ అవసరమవుతుంది.
అయితే వ్యక్తి వయస్సు, ఆరోగ్య పరిస్థితి, శారీరక శ్రమను బట్టి ఈ అవసరాలు మారుతాయి.
గుడ్డు తింటే ఎంత ప్రోటీన్ వస్తుంది?
ప్రోటీన్ లెక్కల్లో చాలామంది పొరబడుతుంటారు. ఒక గుడ్డు మొత్తం బరువు సుమారు 60 గ్రాములు ఉన్నప్పటికీ అందులో లభించే ప్రోటీన్ మాత్రం 6–8 గ్రాములే. అంటే ఆహారం మొత్తం బరువును ప్రోటీన్ పరిమాణంగా భావించకూడదు.
ప్రోటీన్ కోసం ఈ ఆహారాలు తీసుకోండి!
ప్రోటీన్ కోసం ఖరీదైన Supplements కొనాల్సిన అవసరం లేదు. మన రోజువారీ ఆహారంలోనే మంచి వనరులు ఉన్నాయి.
- శాకాహారులు: కందిపప్పు, పెసరపప్పు, శనగలు, రాజ్మా, సోయాబీన్స్, పనీర్, పాలు, పెరుగు, టోఫు.
- మాంసాహారులు: గుడ్లు, చికెన్, చేపలు.
ఒకేసారి కాకుండా.. రోజంతా తీసుకోండి!
రోజువారీ ప్రోటీన్ అవసరాన్ని ఒకే భోజనంలో తీసుకోవడం కంటే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాల్లో విభజించుకోవడం మంచిది. ఇలా చేయడం వల్ల రోజంతా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ప్రతి భోజనంలోనూ కొంత Protein ఉండేలా చూసుకోవాలి.