లెంకాలపల్లికి సర్పంచ్ ఎన్నిక నిర్వహించండి

23-11-2026 | 03:26pm
  1. కలెక్టర్‌కు గ్రామస్తుల వినతి
  2. విజయలక్ష్మి మృతితో అభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన

నల్లబెల్లి, నవంబర్ 23 ( విజయ క్రాంతి ): గ్రామాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని లెంకాలపల్లి సర్పంచ్(Lenkalapalli Sarpanch) స్థానానికి తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్)లో జిల్లా కలెక్టర్‌కు గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు కొత్తపెళ్లి అశోక్, మాజీ సర్పంచ్ గన్నెబోయిన చేరాలు గౌడ్ మాట్లాడుతూ. దివంగత సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి రవీందర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే దాతల సహకారంతో వాటర్ ప్లాంట్, వైకుంఠ రథం, కొత్త విద్యుత్ లైన్లు,

ట్రాన్స్‌ఫార్మర్లు, బోరుబావుల వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేశారన్నారు.గత మూడు నెలల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె అకాల మరణం చెందడంతో గ్రామాభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్, డీపీఓ స్పందించి పంచాయతీ ఎన్నికల నిబంధనల ప్రకారం ఖాళీగా ఉన్న సర్పంచ్ స్థానాన్ని భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ బోయిన పోషాలు యాదవ్, మాజీ ఎంపీటీసీ సృజన రత్నాకర్ గౌడ్, నాయకులు కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, ఆకుల సాంబారావు, వార్డు సభ్యులు గడ్డమీద బాబు గౌడ్, మామిండ్లపెళ్లి రాణి రాజు, మేకల వెంకటేష్ ముదిరాజ్, నానబోయిన కిరణ్ యాదవ్, నాతి రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు