వదంతులు నమ్మొద్దు.. అప్రమత్తంగా ఉండండి
హైదరాబాద్: నగరంలో బాంబు బెదిరింపు ఈమెయిల్(Bomb Threat Email) కలకలం రేపిన నేపథ్యంలో పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్(Hyderabad CP Mahesh Bhagwat) స్పందించారు. ఇలాంటి బెదిరింపు కాల్స్, ఈమెయిల్స్ వస్తుంటాయని, వాటిని ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని సూచించారు.
ఈ ఘటనపై సైబర్ క్రైమ్(Cyber Crime) విభాగంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. బెదిరింపు మెయిల్ వెనుక ఎవరున్నారు, ఎక్కడి నుంచి పంపించారనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అనుమానిత ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
మరోవైపు నగరంలోని కీలక ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. కాచిగూడ రైల్వే స్టేషన్, హోటల్ టూరిస్ట్ ప్లాజా సహా అనుమానం ఉన్న ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, వాటిని ఇతరులకు పంపించవద్దని సీపీ విజ్ఞప్తి చేశారు. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే వెంటనే 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.