మంత్రాల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మోసం
ఆదిలాబాద్, నవంబర్ 23 (విజయక్రాంతి): మంత్రతంత్రాలు, పూజల (Black Magic) పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి ప్రజలను మోసం చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా (Interstate Gang) గుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి నగదు, కార్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఇచ్చోడలోని జాతీయ రహదారి అండర్ బ్రిడ్జి సమీపంలో ఈ నెల 19న మంత్రతంత్రాలు, పూజలతో డబ్బులు రెట్టింపు చేసి ఇస్తామని నమ్మించి రూ.3 లక్షలు బలవంతంగా లాక్కొని మోసగించారని బాధితుడు తోకల రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన పరిచయస్తుడైన శ్రీపతి శంకర్‌తో కలిసి ఇటీవల ఆదిలాబాద్‌కు వచ్చిన సమయంలో బక్కన్న, ఆత్రం పరశురాం, నౌగాడే శేకర్, మండలి శైలేష్, షేక్ అలీం అనే వ్యక్తులు పరిచయమయ్యారని బాధితుడు తెలిపాడు. డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించి తనను మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు (Investigation) చేపట్టగా, ఈ ముఠా చేతిలో వివిధ కేసుల్లో మొత్తం 24 మంది మోసపోయినట్లు వెల్లడైందని ఎస్పీ తెలిపారు. గతంలో కరీంనగర్, నిజామాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాల్లోనూ నిందితులు మోసాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.3,74,000 నగదు, మూడు కార్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.మీడియా సమావేశంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే (ఐపీఎస్), సీసీఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్సై విష్ణు ప్రకాష్, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.