మావోయిస్టులకు రివార్డులు పంపిణీ
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాట్లు(Maoist Surrenders) కొనసాగుతున్నాయి. జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన 214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల నగదు రివార్డులను డీజీపీ సీవీ ఆనంద్(DGP CV Anand) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మావోయిస్టుల లొంగుబాట్లు, ఆయుధాల స్వాధీనం, పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
2024 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 824 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు డీజీపీ తెలిపారు. ఒక్క 2026లోనే 266 మంది జనజీవనంలోకి వచ్చారని పేర్కొన్నారు. లొంగిపోయిన వారిలో 755 మందికి కలిపి రూ.22.31 కోట్ల రివార్డులు(Rewards) మంజూరైనట్లు వివరించారు.
మరోవైపు కర్రెగుట్టల ప్రాంతంలో గుర్తించిన తొమ్మిది డంపుల నుంచి 252 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. మావోయిస్టు(Maoist) కార్యకలాపాల నియంత్రణలో పోలీసుల చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇంకా ముగ్గురు సీనియర్ మావోయిస్టు నాయకులు అజ్ఞాతంలో ఉన్నారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. వారు కూడా హింసాత్మక మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని పిలుపునిచ్చారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వ పునరావాస విధానం ప్రకారం సహాయ సహకారాలు అందిస్తామని స్పష్టం చేశారు.