క్రిస్మస్ వేడుకలకు చర్చిలకు 30 వేల ఆర్థిక సహాయం
పెద్దపల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): క్రిస్మస్ పండుగ–2026 (Christmas Festival) సందర్భంగా జిల్లాలోని క్రైస్తవ మైనారిటీలకు తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఆర్థిక సహాయం అందించనుంది. చర్చిలకు వైట్వాషింగ్, విద్యుత్ దీపాలంకరణ కోసం ఒక్కో చర్చికి రూ.30 వేల చొప్పున ఆర్థిక సహాయం మంజూరు చేయనున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి జి. రవి కుమార్ తెలిపారు.
ఈ మొత్తంలో చర్చి వైట్వాషింగ్ కోసం రూ.20 వేలు, విద్యుత్ దీపాలంకరణ కోసం రూ.10 వేలు కేటాయించినట్లు వివరించారు. అర్హత కలిగిన చర్చిలు తప్పనిసరిగా రిజిస్టర్ అయి ఉండాలని, గుర్తింపు పొందిన చర్చి కమిటీతో పాటు బ్యాంకు ఖాతా (Bank Account) కలిగి ఉండాలని సూచించారు. చర్చి కమిటీ అధ్యక్షుడు లేదా కార్యదర్శి మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2026లో కొత్తగా దరఖాస్తు చేసుకునే చర్చిలకు మొదటి ప్రాధాన్యత ఉంటుందని, లక్ష్యం మిగిలితే గత ఏడాది సహాయం పొందిన చర్చిలను కూడా పరిశీలిస్తామని వెల్లడించారు.
అర్హులైన వారు నవంబర్ 30, 2026లోగా తెలంగాణ ఓబీఎంఎంఎస్ అధికారిక వెబ్సైట్ (https://tgobmms.cgg.gov.in/) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ప్రింట్ కాపీతో పాటు చర్చి రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, కమిటీ వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఇతర అవసరమైన పత్రాలను పెద్దపల్లిలోని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయంలో సమర్పించాలన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గరిష్టంగా 25 చర్చిలను మాత్రమే ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన చర్చి కమిటీల అధ్యక్షులు, కార్యదర్శులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి జి. రవి కుమార్ కోరారు