మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే.. మంత్రి ధీమా

23-11-2026 | 12:56pm

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలోకి రావడానికి కార్యకర్తల కష్టాలు, త్యాగాలే ప్రధాన కారణమని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Irrigation Minister Uttam Kumar Reddy) అన్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పనిచేసిన నాయకులు, కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలని సూచించారు. కష్టకాలంలో పార్టీ జెండాను మోసిన వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. 

గాంధీభవన్‌(Gandhi Bhavan)లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ప్రారంభమైన కాంగ్రెస్ పాలన 2034 వరకు కొనసాగాలన్న లక్ష్యంతో నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఏఐసీసీ ఇన్‌ఛార్జితో చర్చిస్తామని తెలిపారు.

రాష్ట్రంలో వ్యవసాయం, సాగునీటి రంగాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఉత్తమ్ పేర్కొన్నారు. కృష్ణా, గోదావరి జలాల వినియోగం, వరి ఉత్పత్తి, ధాన్యం సేకరణలో ప్రభుత్వం మంచి ఫలితాలు సాధించిందని వివరించారు. అర్హులైన పేదలకు రేషన్ కార్డులు, నాణ్యమైన సన్నబియ్యం పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావించారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ(BRS Government) హయాంలో పలు సాగునీటి ప్రాజెక్టులు అసంపూర్తిగా మిగిలిపోయాయని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను పూర్తి చేయడంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు. పెండింగ్ పనులను వేగవంతం చేసి ఎన్నికల్లోపు సాధ్యమైనంత మేర పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ కార్యకర్తలే పార్టీకి అసలైన బలమని, వారి సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడం ద్వారా పార్టీని మరింత పటిష్టం చేయాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు