మోదీ వ్యాఖ్యలకు శశి థరూర్ మద్దతు
ఉద్యోగాలు, వేతనాల (Salaries) విషయంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ మద్దతు పలికారు. అదే సమయంలో దేశంలో నిరుద్యోగం (Unemployment), అవినీతి, ప్రభుత్వ విధానాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు. న్యూఢిల్లీలో జరిగిన ఫిక్కీ వార్షిక సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వం పన్ను రాయితీలు (Tax Benefits) కల్పించినప్పటికీ, అందుకు ప్రతిగా కంపెనీలు ఎన్ని ఉద్యోగాలు కల్పించాయి? ఉద్యోగుల వేతనాలను ఎంతమేర పెంచాయంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన శశి థరూర్.. ప్రధాని లేవనెత్తిన అంశంలో వాస్తవం ఉందని అభిప్రాయపడ్డారు.
కంపెనీలు మరిన్ని పెట్టుబడులు పెట్టి, ఎక్కువ ఉద్యోగాలు కల్పించడంతో పాటు వేతనాలు పెంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పన్నులు తగ్గించిందని తెలిపారు. అయితే కార్పొరేట్ సంస్థలు తమ బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేర్చలేదని అభిప్రాయపడ్డారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని థరూర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా విద్యావంతులైన యువత ఉద్యోగాల కోసం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐఐటీ (IIT) గ్రాడ్యుయేట్లకు సైతం ఉద్యోగ నియామకాలు లభించని పరిస్థితులు కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
కేవలం కార్పొరేట్ కంపెనీలదే తప్పు కాదని, ప్రభుత్వ విధానాల్లోనూ మార్పులు రావాలని సూచించారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేయడంతో పాటు నియంత్రణపరమైన అడ్డంకులను తొలగించాలని కోరారు. తాను మాట్లాడిన పలువురు వ్యాపారవేత్తలు దేశంలో అవినీతి పెరిగిందని చెబుతున్నారని పేర్కొన్నారు.ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపుపై ప్రధాని మోదీ వ్యాఖ్యలకు మద్దతు ఇస్తూనే.. నిరుద్యోగం, అవినీతి, ప్రభుత్వ విధానాలపై శశి థరూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.