పూజల పేరుతో భారీ మోసం.. ఐదుగురు అరెస్ట్
ఆదిలాబాద్: పూజలతో డబ్బులను రెట్టింపు(Money Doubling) చేస్తామంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్న ముఠా గుట్టును ఆదిలాబాద్ పోలీసులు(Adilabad Police) రట్టు చేశారు. త్వరగా ఎక్కువ డబ్బు సంపాదించవచ్చనే ఆశ చూపిస్తూ పలువురిని మోసం చేసిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. పూజలు నిర్వహిస్తే చేతిలోని నగదు రెండింతలవుతుందని నమ్మించి ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆదిలాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లోనూ బాధితులను లక్ష్యంగా చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఈ వ్యవహారంపై పలు కేసులు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితుల నుంచి రూ.3.74 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మోసాల వెనుక మరికొందరి ప్రమేయం ఉందా? ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. పూజలు, తంత్రాల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామంటూ ఎవరైనా ఆశ చూపితే నమ్మవద్దని, ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.