ప్రపంచ చెస్బాక్సింగ్లో జుక్కల్ యువతికి స్వర్ణ పతకం
ప్రతిభ తక్కడ్‌పల్లికి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అభినందనలు
జుక్కల్ నవంబర్ 23 (విజయ క్రాంతి) : జుక్కల్ నియోజకవర్గానికి(Jukkal constituency) చెందిన యువ ప్రతిభ తక్కడ్‌పల్లి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి దేశానికి, నియోజకవర్గానికి గర్వకారణంగా నిలిచిందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. ఇస్తాంబుల్‌లో జరిగిన 8వ WCBO ప్రపంచ చెస్‌బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని సాధించిన ప్రతిభ తక్కడ్‌పల్లికి ఎమ్మెల్యే హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ప్రపంచ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి స్వర్ణ పతకం సాధించడం సాధారణ విషయం కాదని, ఇందుకు ఆమె చేసిన కృషి, సాధన, పట్టుదల, ఆత్మవిశ్వాసం ఎంతో అభినందనీయమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చదరంగం వ్యూహాత్మక ఆలోచనతో పాటు బాక్సింగ్‌లో శారీరక దారుఢ్యాన్ని కలగలిపిన చెస్బాక్సింగ్లో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించడం ప్రతిభ ప్రత్యేకతకు నిదర్శనమన్నారు. ప్రతిభ సాధించిన ఈ విజయం జుక్కల్ నియోజకవర్గ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకుని నిరంతరం కష్టపడితే ప్రపంచ స్థాయిలోనూ విజయాలు సాధించవచ్చనే విషయాన్ని ఆమె నిరూపించిందని పేర్కొన్నారు. యువత క్రీడల వైపు ఆసక్తి పెంచుకుని తమ ప్రతిభను చాటుకోవాలని ఆయన ఆకాంక్షించారు. పిట్లం కు చెందిన ప్రతిభ తక్కడ్‌పల్లి భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలు సాధించి దేశానికి మరింత పేరు తీసుకురావాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఆమె విజయానికి కుటుంబ సభ్యులు, కోచ్‌లు, సహకరించిన ప్రతి ఒక్కరినీ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అభినందించారు.