IPL 2027: పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్ సింగ్

11-11-2026 | 01:17pm

ఐపీఎల్‌లో సంచలనం.. పంజాబ్‌కు హార్దిక్, ముంబైకి అర్ష్‌దీప్

విజయక్రాంతి స్పోర్ట్స్: ఐపీఎల్ 2027(IPL 2027) సీజన్‌కు ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ ఆటగాళ్ల మార్పిడి చోటుచేసుకుంది. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Mumbai Indians captain Hardik Pandya) పంజాబ్ కింగ్స్ జట్టులోకి వెళ్లగా, పంజాబ్ స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌కు మారాడు. ఈ ట్రేడ్‌ను ఐపీఎల్ అధికారికంగా ప్రకటించింది.

హార్దిక్ పాండ్యా రూ.18 కోట్ల ఒప్పందంతో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)లో చేరనున్నాడు. ఇప్పటివరకు ముంబై తరఫున అతడికి రూ.16.35 కోట్ల ఒప్పందం ఉండగా, కొత్త జట్టులో ఫీజు పెరిగింది. మరోవైపు అర్ష్‌దీప్ సింగ్ తన ప్రస్తుత రూ.18 కోట్ల ఫీజుతోనే ముంబై ఇండియన్స్ తరఫున ఆడనున్నాడు.

హార్దిక్ పాండ్యా – ముంబై నుంచి పంజాబ్‌కు

2015లో ముంబై జట్టుతో ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన హార్దిక్.. 2015, 2017, 2019, 2020లో టైటిల్ విజయంలో భాగమయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా 2022లో టైటిల్ అందించి, 2024లో తిరిగి ముంబై పగ్గాలు చేపట్టాడు. మొత్తం 162 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 2,955 పరుగులు, 82 వికెట్లు సాధించాడు. 

అర్ష్‌దీప్ సింగ్ – పంజాబ్ నుంచి ముంబైకి

2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్.. పంజాబ్ కింగ్స్ తరఫున 96 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. కొత్త బంతితో వికెట్లు తీయడంతో పాటు డెత్ ఓవర్లలోనూ రాణించే సామర్థ్యం అతడి ప్రత్యేకత. 

ఈ మార్పిడితో పంజాబ్ కింగ్స్‌కు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)కు నాణ్యమైన ఎడమచేతి వాటం పేసర్ అందుబాటులోకి వచ్చారు. హార్దిక్ రాకతో పంజాబ్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలకు అదనపు బలం చేకూరనుండగా, అర్ష్‌దీప్ చేరిక ముంబై బౌలింగ్ విభాగాన్ని మరింత పటిష్టం చేయనుంది.


మరిన్ని వార్తలు