విండీస్‌కు అభిషేక్ వార్నింగ్‌

06-10-2026 | 05:36pm

లక్నో: వెస్టిండీస్‌తో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌పై టీమిండియా ఫోకస్‌ పెట్టింది. తొలి మ్యాచ్‌కు ముందు భారత యువ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ జట్టు లక్ష్యాలను వెల్లడించాడు. ఇటీవల ఆసియా క్రీడల ఫైనల్లో పాకిస్థాన్‌పై దూకుడైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న అభిషేక్‌.. ఇప్పుడు విండీస్‌ సిరీస్‌లోనూ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నాడు. జియో హాట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. ఒక్కసారి విజయం సాధించడం కంటే, గెలుపును ఒక అలవాటుగా మార్చుకోవడమే తమ అసలు లక్ష్యమని అభిషేక్‌ చెప్పాడు.

ఒక మ్యాచ్‌లో మంచి ప్రదర్శన ఇచ్చి ఆగిపోకుండా అదే స్థాయి ఆటను పదేపదే కొనసాగించడం ద్వారా స్థిరమైన విజయాలు సాధించాల్సి ఉందని పేర్కొన్నాడు. టీమిండియా విజయానికి ప్రతి ఆటగాడు తన వంతు పాత్ర పోషించాల్సిందేనని అభిషేక్‌ స్పష్టం చేశాడు. జట్టు ప్రయోజనాన్ని ముందుగా పెట్టుకుని అందరూ కలిసి ఆడితే విజయం సహజమైన ఫలితంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.

‘వైభవ్‌కు మేమంతా అండగా ఉంటాం’

యువ క్రికెటర్లకు జట్టు ఇచ్చే మద్దతుపై కూడా అభిషేక్‌ మాట్లాడాడు. ముఖ్యంగా వైభవ్‌ సూర్యవంశీ ప్రతిభను ప్రశంసించాడు. చిన్న వయసులోనే ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో తన సామర్థ్యాన్ని చాటుకుంటున్న వైభవ్‌పై అనవసరమైన ఒత్తిడి లేకుండా చూసుకోవడం సీనియర్ల బాధ్యత అని చెప్పాడు. పెద్ద అన్నల్లా అతడికి అండగా ఉంటామని భరోసా ఇచ్చాడు. యువ ఆటగాళ్లకు సరైన మార్గదర్శకత్వం, మద్దతు లభిస్తే వారి ప్రతిభ మరింత మెరుగ్గా బయటపడుతుందని అభిషేక్‌ పేర్కొన్నాడు.

గెలుపు జోరుపై టీమిండియా నమ్మకం

ఇటీవల సాధించిన విజయాలు జట్టులో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయని అభిషేక్‌ తెలిపాడు. అదే నమ్మకంతో వెస్టిండీస్‌తో సిరీస్‌ను బలంగా ప్రారంభించాలన్న పట్టుదలతో ఉన్నామని చెప్పాడు. టీమ్‌ వర్క్‌నే తమ బలంగా అభివర్ణించిన అభిషేక్‌.. ప్రత్యర్థి జట్టులో ఎంతమంది ప్రమాదకర హిట్టర్లు ఉన్నా, తమ ప్రణాళికకు అనుగుణంగా దూకుడైన క్రికెట్‌ ఆడతామని స్పష్టం చేశాడు. మొత్తంగా.. వెస్టిండీస్‌తో సిరీస్‌కు ముందు అభిషేక్‌ శర్మ వ్యాఖ్యలు టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని చాటుతున్నాయి. వరుస విజయాలను సాధించి గెలుపును అలవాటుగా మార్చుకోవాలన్న లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగనుంది.

మరిన్ని వార్తలు