అభివృద్ధి కోసం లేని నిధులు..

06-10-2026 | 08:53pm
  1. ఆర్భాటాలకు ఎలా వచ్చాయి...
  2. లైట్లు, క్లాంపులు అడిగితే లేవు.. దసరాకు లక్షల రూపాయలు ఖర్చు చేస్తారా
  3. 7వ వార్డు కౌన్సిలర్ బైకాని సునీత సంచలన ఆరోపణలు

ములుగు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ములుగు మున్సిపాలిటీలో చైర్మన్, కమిషనర్ల తీరుపై 7వ వార్డు కౌన్సిలర్ బైకాని సునీత ఓదెలు ఆరోపణలు చేశారు. అభివృద్ధి కోసం అడిగితే నిధులు లేవని వాయిదాలు వేస్తూ ఆర్బాటల కోసం ఖర్చు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

నిబంధనల ప్రకారం లక్ష దాటితే టెండర్ పిలిచి కౌన్సిల్ తీర్మానం చేయాలి. ఎలాంటి తీర్మానం లేకుండా దసరా ఖర్చుల పేరుతో 11 లక్షల నుంచి 30 లక్షల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 19 మంది కౌన్సిలర్లకు తెలియకుండా నర్సంపేట వారితో చీకటి ఒప్పందం చేసుకుని, తోపుకుంట కట్ట మీద 15 రోజులుగా రహస్యంగా ఆర్చ్ గేటు కట్టిస్తున్నారని, ఇదంతా కమిషన్ల కోసమేనని విమర్శించారు.

పాలకవర్గం ఏర్పడినప్పటి నుండి వీధి దీపాలకు లైట్లు, క్లాంపులు అడిగినా ఇవ్వని అధికారులు దసరా పేరుతో లక్షలు తరలించడం దారుణమన్నారు.

7వ వార్డు మాధవరావుపల్లిలో తీవ్ర నీటి సమస్య ఉందని, బోరు కోసం ప్రతి మీటింగ్‌లో కోరినా స్పందించడం లేదని, కార్మికులకు నెలల తరబడి జీతాలు పెండింగ్ పెట్టి ఈ లక్షలు ఎక్కడి నుంచి తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 15 వేలు ఉన్న కమర్షియల్ ట్యాక్స్‌ను లక్షకు, 3 వేలు ఉన్న పేదల ఇంటి పన్నును 30 వేలకు పెంచడం కూడా ఈ దోపిడీ కోసమేనా అని ప్రశ్నించారు. ఈ అవినీతిపై జిల్లా కలెక్టర్ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు