ప్రజల విశ్వాసమే లక్ష్యంగా పనిచేయాలి
హైదరాబాద్: గ్రూప్-1 శిక్షణను పూర్తి చేసుకున్న ఆరుగురు రిజిస్ట్రార్లు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivas Reddy)ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సేవల్లో ప్రజలే కేంద్రబిందువుగా పనిచేయాలని పొంగులేటి సూచించారు.
విధుల్లో సేవాభావాన్ని ప్రదర్శిస్తూ ప్రజల విశ్వాసాన్ని పొందేలా అధికారులు వ్యవహరించాలని అన్నారు. ప్రతి నిర్ణయంలో బాధ్యత, పారదర్శకత పాటించాలని, ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభంగా అందేలా కృషి చేయాలని మంత్రి సూచించారు. అధికారుల పనితీరు ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేస్తుందని పేర్కొన్న ఆయన.. నిబద్ధతతో విధులు నిర్వర్తిస్తూ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.