జనగామలో ఇండియా కూటమి భారీ ర్యాలీ
జనగామ, అక్టోబర్ 06 (విజయక్రాంతి): ప్రజాస్వామ్య పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో జనగామ(Jangaon) జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జాతీయ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సచిన్ సావంత్, జనగామ నియోజకవర్గ ఇన్ చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ, లక్ష్మీనారాయణ నాయక్, గంప వేణు గోపాల్, దుద్ధిల్ల శ్రీనుబాబు, బాలమణి శ్రీనివాస్ పాల్గొన్నారు. సచిన్ సావంత్ మాట్లాడుతూ ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఓట్ల జాబితాలో అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓటు చోరీ అంశాన్ని రాహుల్ గాంధీ ముందే గుర్తించారని తెలిపారు.
ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని కోరారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కు పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో కాంగ్రెస్, వామపక్ష, ఇతర కూటమి పక్షాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.