గీత కార్మికుల భద్రతకు ‘కాటమయ్య రక్ష’ కిట్లు!
బూరుగుపల్లిలో 100 కిట్ల పంపిణీ.. గీత కార్మికులకు శిక్షణ
గజ్వేల్, అక్టోబర్ 13: తాటి చెట్లు ఎక్కి కల్లు గీసే గౌడ సోదరుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని గజ్వేల్ ఎక్సైజ్ సీఐ శిరీష(Excise CI Sirisha) తెలిపారు. మంగళవారం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో గౌడ సంఘం సభ్యులకు 100 ‘కాటమయ్య రక్ష’ కిట్లను ఎక్సైజ్ సీఐ శిరీష, ఎస్సై శైలజ, బీసీ సంక్షేమ అధికారి సుశాంత్ పంపిణీ చేశారు. అనంతరం కిట్ల వినియోగంపై గీత కార్మికులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సీఐ శిరీష మాట్లాడుతూ తాటి చెట్లు ఎక్కి కల్లు గీసే సమయంలో ప్రమాదాలు జరిగి గీత కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలను నివారించేందుకు ఆధునిక సాంకేతికతతో కూడిన భద్రతా పరికరాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఒక్కో కిట్‌లో తాళ్లు, క్లిప్పులు, హ్యాండిల్స్, స్లింగ్ బ్యాగ్, లెగ్ లూప్ సహా ఆరు పరికరాలు ఉంటాయని వివరించారు. వీటి వినియోగంతో గీత కార్మికులు తాటి చెట్లు ఎక్కే సమయంలో ప్రమాదాల ముప్పును తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సిబ్బంది, గౌడ సంఘం నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.