దోహాలో ఘనంగా ‘తెలంగాణ వైభవం-2026’ వేడుకలు

26-10-2026 | 11:41pm

కోనరావుపేట, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ఖతార్‌లోని దోహాలో తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు గద్దె శ్రీనివాస్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ వైభవం-2026(Telangana Vaibhavam 2026)’ వేడుకలు ఘనంగా నిర్వహించారు. దోహాలోని లయోలా ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఈ వేడుకలకు సుమారు 2,500 మంది తెలంగాణవాసులు, గల్ఫ్ కార్మికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు, మహిళల ఆటపాటలు, తెలంగాణ జానపద కళారూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, కళలను ప్రతిబింబించే కార్యక్రమాలు సభికులను అలరించాయి. విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణవాసులంతా ఒకచోట చేరి తమ ప్రాంతీయ సంస్కృతిని చాటుకోవడం వేడుకలకు ప్రత్యేక శోభను తెచ్చింది. ఈ కార్యక్రమానికి భారత రాయబారి డా. కె. శ్రీకర్ రెడ్డి, ఆయన సతీమణి ప్రతిమా రెడ్డి, ఐసీసీ ఉపాధ్యక్షుడు శాంతను దేశ్‌పాండే, ప్రముఖ జానపద గాయకుడు తిరుపతి మాట్ల, సీనియర్ జర్నలిస్ట్ బాలు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణతోపాటు గల్ఫ్‌లో నివసిస్తున్న తెలంగాణ ప్రజల ఐక్యతను చాటేలా ఈ వేడుకలు ఉత్సాహంగా సాగాయి.

మరిన్ని వార్తలు