పంచాయతీ నిధులపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు!

26-10-2026 | 11:51pm

గిరిజన ఇసుక సొసైటీపై ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి

సర్పంచ్ కలం కల్పన

మణుగూరు, అక్టోబర్ 26, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం రామానుజవరం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం జరుగుతోందంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను సర్పంచ్ కలం కల్పన(Sarpanch Kalam Kalpana) ఖండించారు. గ్రామ అభివృద్ధిని అడ్డుకుంటూ, వందలాది మంది గిరిజనులకు ఉపాధి కల్పిస్తున్న శ్రీ సమ్మక్క సరళమ్మ గిరిజన ఇసుక సొసైటీపై తప్పుడు ఫిర్యాదులు చేయడం సరికాదని ఆమె పేర్కొన్నారు.

ఈ అంశాలపై సర్పంచ్ కలం కల్పనతో పాటు సొసైటీ సభ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.పంచాయతీ నిధుల వినియోగం నిబంధనల ప్రకారమే జరుగుతోందని, పాలకవర్గ సమావేశంలో తీర్మానాలు చేసిన అనంతరం నోట్‌ఫైళ్లలో నమోదు చేసి, సంబంధిత ప్రక్రియ పూర్తయిన తర్వాతే కార్యదర్శి, సర్పంచ్, ఉపసర్పంచ్‌ల సంతకాలతో బిల్లుల ప్రక్రియ కొనసాగుతుందని కల్పన స్పష్టం చేశారు.

గతంలో సమావేశాల్లో తీర్మానాలు చేసి, బిల్లుల ప్రక్రియలో భాగస్వాములైన వారే ఇప్పుడు నిధుల దుర్వినియోగం జరిగిందంటూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.నిధుల వినియోగంపై ఎవరికైనా అనుమానాలు ఉంటే సంబంధిత అధికారులకు ఆధారాలతో ఫిర్యాదు చేయాలని, వాస్తవాలు తెలుసుకోకుండా ప్రజల్లో అపోహలు సృష్టించడం బాధ్యతారాహిత్యమని అన్నారు.అదేవిధంగా, శ్రీ సమ్మక్క సరళమ్మ గిరిజన ఇసుక సొసైటీ వందలాది మంది గిరిజనులతో పాటు అనేక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు.

సొసైటీలో సభ్యులుగా లేని వ్యక్తులు సభ్యుల పేర్లతో ఫిర్యాదులు చేస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, ఫిర్యాదుల్లోని నిజానిజాలను తేల్చాలని జిల్లా కలెక్టర్‌ను కోరినట్లు సర్పంచ్, సొసైటీ సభ్యులు వెల్లడించారు.పంచాయతీ నిధులకు సంబంధించిన తీర్మానాలు, నోట్‌ఫైళ్లు, బిల్లులు, ఇతర రికార్డులను పరిశీలిస్తే వాస్తవాలు వెల్లడవుతాయని పేర్కొన్నారు. ఆరోపణలు తప్పుడు‌వని విచారణలో తేలితే సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

రాజకీయ కక్షలతో గ్రామ ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని, గిరిజనుల ఉపాధికి విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు.మా దగ్గర దాచాల్సిన రికార్డులు లేవు.. పరిశీలించాల్సిన ఆధారాలు ఉన్నాయి. విచారణ జరగాలి.. నిజాలు నిగ్గు తేలాలి.. తప్పు చేసిన వారు ఎవరైనా చట్టప్రకారం చర్యలు ఎదుర్కోవాలి. రామానుజవరం అభివృద్ధి, గిరిజనుల ఉపాధి విషయంలో తప్పుడు ప్రచారానికి భయపడే ప్రసక్తే లేదు” అని సర్పంచ్ కలం కల్పన, సొసైటీ సభ్యులు స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు