అధికారుల సమన్వయ లేమిపై ప్రజాప్రతినిధుల మండిపాటు
సాలూర, అక్టోబర్ 26 (విజయక్రాంతి): సాలూర మండల(Salura Mandal) కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశం అధికారుల సమన్వయ లోపంపై సర్పంచ్‌లు వ్యక్తంచేసిన నిరసనతో ప్రారంభమైంది.
ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ధోరణి, అధికారుల మధ్య సరైన కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మండల పరిధిలో అభివృద్ధి పనులు మందగిస్తున్నాయని సర్పంచ్‌లు పేర్కొన్నారు. సమావేశ సమయానికి సర్పంచ్‌లు లోపలికి రాకుండా నిరసన తెలుపగా, మండల ప్రత్యేక అధికారి (డీఎల్‌పీవో) నాగరాజు వారితో చర్చలు జరిపి సమావేశ మందిరంలోకి ఆహ్వానించారు.
సర్వసభ్య సమావేశానికి సంబంధించి తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వలేదని, చివరి నిమిషంలో ఉదయం 10 గంటలకు సమావేశం ఉందనడం సరికాదని సర్పంచ్‌లు చెప్పారు. శాఖల వారీగా పూర్తిస్థాయి అధికారులు హాజరు కాకపోవడం, వచ్చిన అధికారులు ప్రగతి నివేదికలు సమర్పించకపోవడంపై దృష్టికి తెచ్చారు. గ్రామాల్లో ఇన్‌ఛార్జి కార్యదర్శుల స్థానంలో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులతో పాటు ఇతర అభివృద్ధి పనుల కోసం మందర్నా వద్ద మంజీరా నది తీరం నుంచి ఇసుక ఉచితంగా పొందేలా అధికారులే నేరుగా అనుమతులు ఇవ్వాలని సర్పంచ్‌లు ప్రతిపాదించారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వరి పంటలు వేయవద్దని అధికారులు ప్రచారం చేస్తున్నారే తప్ప, ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలు వేసే రైతులకు అందాల్సిన ప్రోత్సాహం, విత్తనాలు, అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారాలు, సర్పంచులు పాల్గొన్నారు.