ఛలో ఢిల్లీ సభను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే మందుల సామేలు పిలుపు..
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): నవంబర్ 1న ఏఐసీసీ, ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ రాంలీలా మైదానంలో ఓట్ చోరీ అంశంపై నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు(MLA Mandula Samuel) పిలుపునిచ్చారు. సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
బీజేపీ పాలనపై దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తారని అన్నారు.రాహుల్ గాంధీ ప్రధాని కావాలని ఆకాంక్షించారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో ఢిల్లీ సభకు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ పానుగంటి నర్సింహారెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గుడిపల్లి మధుకర్ రెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఇందుర్తి వెంకట్ రెడ్డి, కార్యదర్శి వేల్పుల రమేష్,రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి, శిగ నసీర్ గౌడ్, బైరబోయిన వేణుగోపాల్, మనోహర్, జలంధర్ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.