ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మోసం..

27-10-2026 | 12:12am

మహిళపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు

ఘట్‌కేసర్‌ పోలీసుల దర్యాప్తు

ఘట్‌కేసర్‌, అక్టోబర్ 26 (విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకోవడంతో పాటు, మహిళపై అత్యాచారం చేసినట్లు వచ్చిన ఫిర్యాదుపై ఘట్‌కేసర్‌ పోలీసులు(Ghatkesar Police) కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన  వివరాల ప్రకారం మల్లాపూర్‌లోని బ్రహ్మపుత్ర కాలనీకి చెందిన 30 ఏళ్ల మహిళ టైలరింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. నాలుగు నెలల క్రితం ఫోన్‌ ద్వారా భువనగిరికి చెందిన జగన్మోహన్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. భువనగిరి మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని, అందుకు రూ.5 లక్షలు ఇవ్వాలని అతడు నమ్మించినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. 

ఈ క్రమంలో అక్టోబర్‌ 26న మల్లాపూర్‌లోని రత్నదీప్‌ సమీపంలో ఆమెను కారులో ఎక్కించుకున్న జగన్మోహన్‌ భువనగిరి మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకెళ్తానని చెప్పి అవుపూర్‌లోని శ్రీనిధి రిసార్ట్‌కు తీసుకెళ్లినట్లు తెలిపింది. ఉద్యోగం ఇప్పించే అధికారి అక్కడ ఉన్నాడని చెప్పి గదిలోకి తీసుకెళ్లి, తనపై దాడి చేసి బలవంతంగా అత్యాచారం చేసినట్లు ఆరోపించింది. అనంతరం కారులో తీసుకెళ్లి హైవేపై కిందకు తోసేసి వెళ్లిపోయినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఉద్యోగం పేరుతో రూ.4.5 లక్షలు తీసుకున్నట్లు కూడా ఆమె తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్‌కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు