ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందేలా చర్యలు తీసుకోవాలి

23-11-2026 | 03:56pm
  1. అర్హులైన ఓటర్లు ఓటు హక్కు కోల్పోకుండా చూడాలి 
  2. పుష్కరాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.. నాణ్యతలో రాజీ వద్దు
  3. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి జిల్లా, నవంబర్ 23(విజయ క్రాంతి): ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం(Indiramma Family Life Insurance Scheme) ప్రయోజనం అందేలా అర్హుల వివరాలను ఖచ్చితంగా సేకరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షCollector Koya Sri Harsha) అధికారులను ఆదేశించారు. అలాగే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అర్హులైన ఏ ఒక్క ఓటరు కూడా ఓటు హక్కు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

సోమవారం రామగిరి మండలం పన్నూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం మంథనిలోని గోదావరి పుష్కర ఘాట్ వద్ద 2027 పుష్కరాలను పురస్కరించుకొని చేపడుతున్న అభివృద్ధి, నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఓటరు జాబితాలో గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన, మరణించిన ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, ప్రతి ఇంటిని సందర్శించి ఓటర్ల వివరాలను నిర్ధారించాలని అధికారులకు సూచించారు. పెండింగ్‌లో ఉన్న ఎన్్యూమరేషన్ ఫారాలను త్వరితగతిన సేకరించాలని, అర్హులైన ఓటర్లు ఎవరూ జాబితా నుంచి తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కింద ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా భద్రత కల్పించే లక్ష్యంతో లబ్ధిదారుల పేర్లు, నామినీ వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేయాలని తెలిపారు. పేర్లలో అక్షర దోషాలు, అసంపూర్ణ వివరాలు లేకుండా ధ్రువీకరణ పత్రాలతో సరిపోల్చుకోవాలని, శిబిరాలకు రాని కుటుంబాలను గుర్తించి ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలని సూచించారు.అనంతరం మంథని గోదావరి పుష్కర ఘాట్ అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్.. 2027 పుష్కరాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉన్నందున పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. డిజైన్ ఆమోదాలు పెండింగ్‌లో ఉన్న పనులకు వెంటనే అనుమతులు పొందాలని, ఆమోదం లభించిన వెంటనే నిర్మాణ పనులు ప్రారంభించాలని స్పష్టం చేశారు.

పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు సురక్షిత స్నానాలు, తాగునీరు, పారిశుధ్యం, విద్యుత్ దీపాలు, మరుగుదొడ్లు, రవాణా మార్గాలు, భద్రత వంటి మౌలిక సదుపాయాలు కల్పించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. నిర్ణీత గడువులోగా అన్ని పనులు నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, పనుల్లో జాప్యం జరిగితే సహించేది లేదని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో రామగిరి తహసీల్దార్ సుమన్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు