రెహమాన్ క్రేజీ డెసిషన్.. 12 సినిమాలు వదిలేశారట!
ఒక సినిమా కోసం ఏకంగా 12 అవకాశాలను వదులుకోవడం సాధ్యమేనా? ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ మాత్రం అదే చేశారు. బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ కోసం తనకు వచ్చిన 12 సినిమా అవకాశాలను వదులుకున్నట్లు వెల్లడించారు.గోవాలో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవం (IFFI) వేదికగా రెహమాన్ ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ భారీ ప్రాజెక్టు కోసం హాలీవుడ్ సంగీత దిగ్గజం హన్స్ జిమ్మర్తో కలిసి గత మూడేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమా సంగీతంపైనే పూర్తిగా దృష్టి పెట్టడంతో ఇతర చిత్రాలకు సమయం కేటాయించలేదన్నారు.
ఇక యష్ పోషిస్తున్న పాత్రకు సంబంధించిన సంగీతం కోసం ఏకంగా 13 వెర్షన్లు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కథ తనకు నచ్చితేనే సినిమాలకు సంగీతం అందిస్తానని, ‘రామాయణ’ వంటి మహాకావ్యానికి పనిచేయడం తనకు ఎంతో గర్వకారణమన్నారు. ఒకవైపు 12 సినిమాల అవకాశాలు.. మరోవైపు ఒక్క ‘రామాయణ’! రెహమాన్ ఈ ప్రాజెక్టుపై పెట్టుకున్న ఫోకస్ చూస్తుంటే సినిమా సంగీతంపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి!