టీఎస్ డబ్ల్యూ ఆర్ జెసి విద్యార్థులు తరగతులు బాయ్ కాట్

23-11-2026 | 04:04pm
  1. ఇళ్లకు వెళ్ళిపోయిన 33 మంది ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు
  2. సెలవులు ఇవ్వకపోవడంతోనే బాయ్ కాట్- ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర్లు 

దమ్మపేట, నవంబర్ 23(విజయ క్రాంతి): మండల పరిధి మందలపల్లి లోని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాల(Telangana Social Welfare Gurukul School) మరియు కళాశాల నందు 33 మంది విద్యార్థులు తరగతులను బాయికాట్ చేస్తూ ఇళ్లకు వెళ్ళిపోయిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే టీ ఎస్ డబ్ల్యూ ఆర్ జె సి నందు ద్వితీయ సంవత్సరం బైపీసీ (15), ఎంపీసీ (24) మొత్తం 39 మంది విద్యార్థులు వున్నారు.

వీరిలో బి సాయి చరణ్ అనే విద్యార్థి శనివారం రాత్రి డార్మిటరీ లో లేకపోవడాన్ని గమనించిన నైట్ వాచ్మెన్ మహేష్, నైట్ స్టే టీచర్ అనిల్ కుమార్ కు తెలుపగా ఆయన పక్కనే క్వార్టర్స్లో నివాసం ఉంటున్న కె ప్రవీణ్ కుమార్ కు తెలుపగా వీరిరువురూ రెండు గంటల సేపు క్యాంపస్ మొత్తం గాలించినా విద్యార్థి ఆచూకీ తెలియలేదు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర్లుకు తెలుపగా అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో క్యాంపస్ కు చేరుకున్నారు.

అరగంట తరువాత సుమారు 12.30 గంటల సమయంలో విద్యార్థి సాయి చరణ్ క్యాంపస్ కు రాగా ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని ప్రశ్నించగా, బాత్ రూమ్ కు వెళ్లానని చెప్పడంతో, డార్మిటరీ ప్రక్కనే ఉన్న బాత్ రూమ్ కు వెళ్లొచ్చుగా బయట పాముల భయం వుంది, ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి అని విద్యార్థిపై చేయి చేసుకున్నారు.

ప్రక్కనే ఉన్న పార్ట్ టైం టీచర్ కె ప్రవీణ్ కుమార్ కూడా మందలించి కొట్టి, విద్యార్థి చేత రాత్రి 10 గంటలకు బయటకు వెళ్లి 12.30 గంటలకు తిరిగి వచ్చినట్లు సాయి చరణ్ చే లెటర్ తీసుకున్నారు. తెల్లవారి ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం బైపీసీ, ఎంపీసీ కు చెందిన 33 మంది విద్యార్థులు సాయి చరణ్ కు సపోర్టుగా, ప్రిన్సిపాల్ కు వ్యతిరేకంగా 

కాలేజీ తరగతులను బాయ్ కట్ చేస్తూ ఇళ్లకు వెళ్లిపోయారు. దీంతో ప్రిన్సిపాల్ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేయగా సోమవారం భద్రాద్రికొత్తగూడెం జోన్ జోనల్ అధికారిణి పి అపర్ణ విచారణ చేపట్టారు. ఈ ఘటనపై జోనల్ అధికారిని వివరణ కోరగా విద్యార్థులు ఇంటికి వెళ్ళి తిరిగి రాలేదని, విద్యార్థులను విచారించిన అనంతరం వున్నతాధికారులకు రిపోర్టు అందచేస్తానని విలేకరులకు తెలిపారు. ఈ ఘటనపై ప్రిన్సిపాల్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల మూడు రోజులు సెలవులు అడిగితే తాను నిరాకరించడంతో ఈ అవకాశాన్ని సాకుగా చూపి విద్యార్థులు తరగతులు భహిష్కరించి ఇంటికి వెళ్లిపోయారని తెలిపారు.

మరిన్ని వార్తలు