జంగంగల్లీలో భక్తిశ్రద్ధలతో శ్రావణమాస ఉద్దీపన కార్యక్రమం

12-09-2026 | 10:54pm

బోధన్,(విజయక్రాంతి): బోధన్ పట్టణంలోని జంగం గల్లీలో గల పురాణే మఠం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రావణమాస ఉద్దీపన కార్యక్రమం(Sravana Masam Uddipana Karyakramam) భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. పురాణే అజయ్ కుమార్ ఆధ్వర్యంలో సమాజ ప్రముఖులు సిద్ధి లింగప్ప మహారాజు, సంతోష్ మహారాజ్ సుంకిని సానిధ్యంలో, అర్చకులు జంగం శివరాజప్ప చే  కార్యక్రమం ప్రారంభమైంది. కార్యక్రమానికి మహారాష్ట్రలోని తామ్లూర్‌కు చెందిన షటస్థల బ్రహ్మ 108 శ్రీశ్రీశ్రీ శివానంద శివాచార్య మహారాజ్ విచ్చేశారు. పౌడయ్య రాజేందర్, అంబెల్లి  వీరప్ప దంపతులు స్వామివారికి పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామిజీ తమ సందేశాన్ని అందించారు.

శ్రావణమాసాన్ని పురస్కరించుకుని పురాణే మఠం తరఫున గత 18 సంవత్సరాలుగా నిర్విరామంగా శిష్య బృందంలోని ప్రతి ఇంటా 30 రోజులపాటు రుద్రాభిషేకం, బిల్వపత్రార్చన, శివాష్టోత్తర శత నామావళి తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించడం చాలా అభినందనీయమని వీరశైవులకు తమ సంస్కృతి సాంప్రదాయాలను తర్వాత తరాలకు అందించిన వారుగా నిలుస్తున్నారని, నెల రోజులపాటు కొనసాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముగింపుగా భాద్రపద మాస శుద్ధ పాడ్యమి రోజున ఉద్దీపన కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమానికి తమని ఆహ్వానించడం అనాదిగా జరుగుతున్న సాంప్రదాయమని చాలా అభినందనీయమని అన్నారు.

దైవారాధన, దైవచింతనతో ప్రతిఒక్కరూ నిత్యజీవితాన్ని ప్రారంభించాలని సూచించారు. దైవనామస్మరణ మనిషిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు మోక్షప్రాప్తికి మార్గం చూపుతుందని పేర్కొన్నారు. దానధర్మాలను జీవితంలో భాగంగా చేసుకోవాలని, ముఖ్యంగా ఆకలితో ఉన్నవారి కడుపు నింపే అన్నదానం అన్ని దానాల్లో అత్యంత విశిష్టమైనదని వివరించారు. అనంతరం భక్తులకు దివ్య ఆశీర్వచనాలు అందించారు. ఈ భజన మండలి ఆధ్వర్యంలో భక్తి భజనలు నిర్వహించడంతో జంగం గల్లీలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అనంతరం భక్తులకు మహాప్రసాద వితరణ చేపట్టారు. కార్యక్రమంలో జంగం గల్లి కాలనీవాసులు, యువకులు, మహిళలు, వీరశైవ భక్తులు, ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

మరిన్ని వార్తలు