వసతిగృహంలో ఎలుకల దాడులు!

12-09-2026 | 11:35pm

నెలలోనే రెండోసారి.. నలుగురు విద్యార్థినులకు గాయాలు

ఆస్పత్రికి తరలింపు.. విజిలెన్స్ విచారణ

బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) బూర్గంపాడు మండలం సారపాకలోని తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ బాలికల కళాశాల వసతిగృహం(Telangana State Minority Residential Girls College hostel)లో ఎలుకల బెడద ఆందోళన కలిగిస్తోంది. నెలలోనే రెండోసారి విద్యార్థినులపై ఎలుకలు దాడి(Rats attack) చేశాయి. ఈ నెల 9న రాత్రి నలుగురు విద్యార్థినుల కాళ్లపై ఎలుకలు దాడి చేసినట్లు తెలిసింది. దీంతో వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించి టీటీ ఇంజక్షన్ ఇప్పించిన అనంతరం వసతిగృహానికి తీసుకొచ్చారు.

వరుస ఘటనలు.. ఆందోళన

కళాశాల, వసతిగృహం ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. ఫస్టియర్, సెకండియర్‌కు చెందిన సుమారు 160–200 మంది విద్యార్థినులు ఇక్కడ ఉంటున్నారు. ఈ నెల 3న ముగ్గురు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేయగా.. తాజాగా మరో నలుగురు వాటి బారిన పడటం ఆందోళనకు గురిచేస్తోంది. ఎలుకల నియంత్రణకు శాశ్వత చర్యలు తీసుకోవాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

డ్రైనేజీ నుంచే వస్తున్నాయా?

ఎలుకల దాడులపై ప్రిన్సిపాల్ జ్యోతి మాట్లాడుతూ.. ఘటన వాస్తవమేనని తెలిపారు. బాధిత విద్యార్థినులకు ఆస్పత్రిలో చికిత్స చేయించినట్లు చెప్పారు. డ్రైనేజీ నుంచి ఎలుకలు వస్తున్నట్లు గుర్తించామని, సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి డ్రైనేజీని మూసివేయించినట్లు వివరించారు.

విజిలెన్స్ విచారణ

వరుసగా ఎలుకల దాడులు జరుగుతున్న నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు వసతిగృహంలో విచారణ చేపట్టినట్లు తెలిసింది. పారిశుద్ధ్య పరిస్థితులు, ఎలుకల నియంత్రణకు చేపట్టిన చర్యలపై వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు