16 June, 2026 | 3:51 AM

మెట్రోకు అడ్డు ఆ ముగ్గురే!

16-06-2026 01:37 AM
  1. మెట్రో రెండో దశ విస్తరణకు కేంద్రం అనుమతి ఇస్తలేదు 
  2. కేంద్ర మంత్రులు అశ్విని, ఖట్టర్‌కు కిషన్‌రెడ్డి చెప్పడం వల్లే ఆలస్యం
  3. కిషన్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ కలిసి అడ్డుకుంటున్నారు 
  4. మెట్రో పూర్తయితే బీజేపీకి ఇబ్బందులు వస్తాయని కుట్ర 
  5. నిధుల కోసం కిషన్‌రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయాలి 
  6. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు, ఖాతాల్లో రూ.15 లక్షలు జమ ఏదీ? 
  7. హామీలు అమలు చేయని ప్రధాని మోదీ రాజీనామా చేయాలి 
  8. తర్వాత నేనూ రాజీనామాకు సిద్ధం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి     

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): మెట్రో విస్తరణకు అన్ని రాష్ట్రాల కు అనుమతులు ఇచ్చిన కేంద్రం.. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆహ్మదాబాద్, ఉత్తరప్రదేశ్‌తోపాటు విశాఖకు అనుమతి ఇచ్చి హైదరాబాద్‌కు ఆపారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, కేసీఆర్, కేటీఆర్ కలిసి మెట్రో రెండో దశను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

సోమవారం సచివాలయంలో మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెం కట్‌రెడ్డి, సీతక్క,  వాకిటి శ్రీహరి, అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి తదితరుల తో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బ్యాంకుల అప్పుల బదిలీ విషయంలో రేవంత్‌రెడ్డికి అనుకూలంగా పని చేస్తే.. తెలంగాణలో బీజేపీకి ఇబ్బందులు వస్తాయని కేంద్ర మంత్రులు అశ్వినీవైష్ణవ్, మనోహర్‌లాల్ ఖట్టర్‌కు కిషన్‌రెడ్డి చెప్పడం వల్లే మెట్రో రెండో దశకు నిధుల విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు తనను రాజీనామా చేయాలని కిషన్‌రెడ్డి చేసిన సవాల్‌కు.. ముందు ప్రధాని మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి అంటూ సీఎం ప్రతి సవాల్ విసిరారు. బీజేపీ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని నిలదీశారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని, విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామని వేయలేదని గుర్తు చేశారు. హైదరాబాద్‌కు 2023లోనే ట్రిపుల్‌ఆర్ ప్రకటించారని, ఇంకా సాకారం కాలేదన్నారు. వీటన్నింటికి బాధ్యత వహిస్తూ మోదీ రాజీనామా చేస్తే తాము కూడా రాజీనామా చేస్తాం అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. 

9వ స్థానానికి పడిపోయిన హైదరాబాద్ మెట్రో 

‘హైదరాబాద్ మెట్రో 9వ స్థానానికి పడిపోయింది. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మెట్రో విస్తరణ జరగాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఫేజ్ 2 కోసం ప్రధానితో పాటు కేంద్ర మంత్రు లను కలిసి విజ్ఞప్తి చేశాం. ఫేజ్ 1 నిర్మించిన ఎల్ అండ్ టీ తోనే ఫేజ్ 2 నిర్మించాల్సి ఉంటుందని కేంద్రం నిబంధన పెట్టింది. ఈ ప్రతిపాదనకు ఎల్ అండ్ టీ అంగీక రించలేదు. గత నష్టాలతోనే సతమతమవుతున్న తమకు ఫేజ్ 2 నిర్మించడం కష్టమని తేల్చి చెప్పింది.

రూ.30 వేల కోట్ల ఆస్తి సృష్టించినా ఏటా 400 కోట్లు నష్టం వస్తుందని చెప్పింది. అందుకే ఫేజ్ 2 నిర్మాణంలో భాగస్వా మ్యం కామని స్పష్టంగా చెప్పింది. భవిష్యత్ నిర్వహణకు కూడా ఒప్పుకోమని తిరస్కరించింది. ఎల్ అండ్ టీ సంస్థ నుంచి మెట్రోను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఒక్కటే ఏకైక పరిష్కారం అని కేంద్రం చెప్పింది. రూ.30 వేల కోట్ల ఎల్ అండ్ టీ మెట్రో ఆస్తిని రూ.15 వేల కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. రూ.13,600 కోట్లు 8.25 శాతం వడ్డీకి బ్యాంకుల్లో ఎల్ అండ్ టీ మెట్రోపై రుణం తెచ్చుకుంది.

ఆ లోన్ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. రూ.13,600 కోట్లు 4 శాతం వడ్డీకి జపాన్ సంస్థతో అప్పు తీసుకొచ్చాం. ఇది ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1400 కోట్లు మేం కట్టాం. మిగతా లోన్ వచ్చినట్లే అని అనుకుంటే కిషన్‌రెడ్డి అడ్డుకున్నారు. అందుకే మేం కిషన్‌రెడ్డి వెనక పడుతున్నాం. ఆ నిధులను విడుదల చేయించే బాధ్యత కిషన్‌రెడ్డిదే’ అని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు. గతంలో కేసీఆర్‌కు పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ ద్వారా పదేళ్లలో రూ.3.15 లక్షల కోట్లు ఎలాంటి గ్యారెంటీ లేకుండా, మూడో కంటికి తెలియకుండా 9-.11 శాతం వడ్డీతో అప్పులు ఇచ్చారని తెలిపారు. 

కేసీఆర్ వల్లే 7 వేల కోట్ల వ్యయం పెరిగింది

‘హైదరాబాద్‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో రవాణా సౌకర్యాలు ఉండాలని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. వైఎస్ హయాంలో ఆనాటి కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌కు మెట్రో ప్రాజెక్టు తీసుకొచ్చారు. వైఎస్ మరణానంతరం రోశయ్య హయాంలో మొదటిదశ మెట్రో కోసం ఒప్పందాలు జరిగాయి. 2017 నాటికి మెట్రో మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా ప్రాజెక్టు మొదలైంది. తెలంగాణ వచ్చాక చారిత్రక కట్టడాల సాకుతో మెట్రో మొదటి దశను అడ్డుకున్నారు.

కేసీఆర్ చర్యలతో మెట్రో మొదటి దశ మూడేళ్లు ఆలస్యమైంది. రూ. 15 వేల కోట్లతో పూర్తికావాల్సిన ప్రాజెక్టు రూ.22 వేల కోట్లకు చేరింది. ప్రాజెక్టు ఆలస్యం, కొవిడ్ ప్రభావంతో ఈ ఎల్ అండ్ టీ నష్టాల్లో కూరుకుపోయింది. పదేళ్లు మెట్రో విస్తరణపై గత ప్రభుత్వం ప్రయత్నించలేదు. వాళ్ల ఆస్తులు పెంచుకునేందుకు తప్ప ప్రజల కోసం ఆలోచించలేదు’ అని సీఎం విమర్శించారు. గతంలో కిషన్‌రెడ్డిపై కేసీఆర్ పరుష పదజాలం వాడినా పల్లెత్తు మాట అనని కిషన్‌రెడ్డి.. ఇప్పుడు తామేమి అనకున్న సవాళ్లు విసురుతున్నారని మండిపడ్డారు. కిషన్‌రెడ్డిపై మాకు గౌరవంతో పాటు ఆయనపై అసహనం కూడా ఉందన్నారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ సహకరించినందుకే ఇప్పుడు కిషన్‌రెడ్డి గురుదక్షిణ చెల్లిస్తున్నారని విమర్శించారు.

మెట్రో రెండో దశకు కేంద్రం భాగస్వామ్య అవుతుందా, లేదా?

‘122 కి.మీ.ల మెట్రో రెండోదశకు కేంద్రం భాగస్వామ్యం తీసుకుంటుందా లేదా?  మీ 50 శాతం భాగస్వామ్యం అవసరం వద్దనుకుంటే ఎన్‌ఓసీ ఇవ్వండి. మేమే పూర్తిగా భరించి మెట్రో విస్తరణ చేసుకుంటాం. మీరు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్నారు. నలుగురు మీ ఎంపీలు ఉన్న ప్రాంతంలోనే మెట్రో విస్తరణ జరగాల్సి ఉంది. ఎందుకు కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోరు? వరంగల్ ఎయిర్ పోర్టు స్పీడ్ అయ్యాక వెళ్లి రామ్మోహన్ నాయుడిని కలిశాడు. ఆ పనులు స్లో అయ్యాయి.

జపాన్ సంస్థ ఇప్పటికే నిధులను ఐఆర్‌ఎఫ్‌సీకి విడుదల చేసింది. కానీ ఐఆర్‌ఎఫ్‌సీ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయడంలేదు. ఆ డబ్బులకు వడ్డీ ఎవరు కట్టాలి. రిజర్వు బ్యాంకును ఒప్పించిన లెటర్ కూడా తీసుకెళ్లి ఇచ్చాం. అయినా లోన్ ట్రాన్స్‌ఫర్ కాకుండా అడ్డుకున్నారు. దీనిపై కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకుంటారా లేదా? లేకపోతే ఎన్‌ఓసీ ఇచ్చి మీ భాగస్వామ్యం వదులుకుంటారా? అలా చేస్తే మేమే మెట్రో ఫేజ్ 2ను కట్టుకుని ప్రజలకు అంకితం చేస్తాం’ అని సీఎం రేవంత్ వివరించారు.