3 September, 2026 | 9:27 PM

దద్దరిల్లిన దిల్ సుఖ్ నగర్

03-09-2026 | 08:42pm

ఫీజు బకాయిల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

ఎంపీ ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో విద్యార్థుల భారీ ర్యాలీ

ఎల్బీనగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య(MP R. Krishnaiah)  డిమాండ్ చేశారు. గురువారం దిల్ సుఖ్ నగర్(Dilsukhnagar) లో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ... రాష్ట్రంలోని 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన రూ.8,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్(Fee reimbursement) బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఫీజు బకాయిలు రాక సుమారు 300 కళాశాలలు మూతపడ్డాయని, దీంతో విద్యార్థుల భవిష్యత్ నాశనమవుతోందని, వెంటనే నిధులు విడుదల చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ పథకాలను ఎత్తేయాలనే కుట్రలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మానుకోవాలని, పేద విద్యార్థులకు(Students) ఉన్నత చదువులకు దూరం చేయొద్దని కోరారు. పాత పద్ధతిలోనే రీయింబర్స్ మెంట్ కొనసాగించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం కొనసాగుతుందని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పగిళ్ల సతీష్, నీలం వెంకటేశ్,     బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్, ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్స్ రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.