పాఠశాలలకు అమావాస్య ఎఫెక్ట్..
కరీంనగర్/వేములవాడ, జూన్15 (విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. అమావాస్య సెంటిమెంట్ తీవ్ర ప్రభావం చూపింది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు అశుభకరమని భావించిన తల్లిదండ్రులు.. తొలిరోజు పిల్లలను బడులకు పంపలేదు. దీనివల్ల ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం గణనీయంగా తగ్గింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం గీతానగర్లోని బాలికల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఒక్కతే పాఠశాలకు వచ్చింది. తోటి క్లాస్మేట్స్ ఎవరూ లేకపోవడంతో ఆ విద్యార్థిని ఒంటరిగానే క్లాస్ రూంలో కూర్చుంది.
ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పునఃప్రారంభ తేదీ అమావాస్య రోజు రావడంతో కొందరు అశుభంగా భావిస్తున్నారు. తెల్లవారి పంపుదామంటే మంగళవారం అవుతుండడంతో ఈ రెండు రోజులు పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని వారు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ రోజుల్లో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ముందుగానే అమావాస్యను ఆలోచించి ఈ నెల 17న (బుధవారం), 19న (శుక్రవారం) ప్రారంభించేందుకు నిర్ణయించాయి.






